కాసేపట్లో పెళ్లిపీటలపై ఒక్కటి కావాల్సిన జంటను కరోనా మహమ్మారి విడగొట్టింది. మూడు ముళ్లు, ఏడడుగులు వేయాల్సిన సమయంలో ఎక్కడి వారక్కడ పరుగులు పెట్టారు. బంధువులు, స్నేహితుల మధ్య జరగాల్సిన పెళ్లి పెటాకులైంది. అనంతపురం జిల్లా కదిరిలో జరిగిందీ సంఘటన. కరోనా పాజిటివ్ పేరుతో పెళ్లి పీటల మీదే ఓ పెళ్లి జంట విడిపోయింది. జిల్లాలోని ధర్మవరానికి చెందిన ఓ అబ్బాయి ముదిగుబ్బ కు చెందిన ఓ అమ్మాయితో వివాహం జరిపించేందుకు పెద్దమనుసుల సమక్షంలో ముహూర్తం నిర్ణయించారు. ముందుగా నిశ్చయించుకున్న ప్రకారం వివాహ వేదిక కదిరికి చేరుకున్నారు. బందువులంతా కలిసి సంప్రదాయం ప్రకారం పెళ్లి కార్యక్రమాలకు సిద్ధం చేశారు. ఇంతలోనే ఈ పెళ్లి తనకు ఇష్టం లేదంటూ మొండికేసింది పెళ్లికూతురు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఇప్పుడు పెళ్లి వద్దని తేల్చి చెప్పింది. పెళ్లికూతురు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో పంచాయితీ కాస్త పొలిస్ స్టేషన్ మెట్లెకింది.
తమ బిడ్డను, తమను భయపెట్టి పెళ్లి చేయాలని చూస్తున్నారని, లేదంటే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పెళ్లికూతురు తల్లి చెబుతోంది.
మొదటి నుంచి తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కుమార్తె చెబుతోంది. కరోనా ఉందని చెబుతున్నా బలవంతంగా తాళి కడతామని చెబుతున్నారని అంటోంది. మరోవైపు ఇప్పటికే తమవద్ద నుంచి మూడు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, నగదు తీసుకున్నారని, డబ్బుల ఆశతోనే పెళ్లికి ఒప్పుకోలేదని పెళ్ళికొడుకు అంటున్నారు.
పెళ్లికూతురు, ఆమె తల్లి ఇష్ట ప్రకారమే అన్నింటికి ఒప్పుకుని డబ్బులు కూడా తీసుకున్నారని తీరా పెళ్లిపీటలకు వరకు వచ్చేసరికి అడ్డం తిరగారని సంబంధం కుదిర్చిన పెళ్లి పెద్ద చెబుతున్నారు. అయితే తమ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కదిరి టౌన్ ఎస్సై మహ్మద్ రఫీ చెప్పడంతో ఇరువురు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మొత్తానికి కరోనా కారణంగా పెళ్లి పెటాకులు కావడం స్థానికంగా సంచలనంగా మారింది.
Also Read: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన పసిడి ధరలు.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే..!