Andhra: ఇత్తడి సామాన్లు కనిపిస్తే చాలు.. వాళ్లు చేతులకు తిమ్మిర్లు మొదలవుతాయ్..

పగటిపూట గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ షాపులపై రెక్కీ.. రాత్రివేళల్లో ఇత్తడి వస్తువుల చోరీ. పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదుతో పాటు చోరీ చేసిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Andhra: ఇత్తడి సామాన్లు కనిపిస్తే చాలు.. వాళ్లు చేతులకు తిమ్మిర్లు మొదలవుతాయ్..
Brass Items Theft Gang Held

Edited By:

Updated on: Aug 12, 2026 | 5:48 PM

పగటిపూట గ్రామాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహించడం.. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడటం.. ఇత్తడి వస్తువులే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. చేబ్రోలు మండలం వడ్లమూడి గరువుపాలెంలోని వీకే ఇంజనీర్స్ షాపులో గత నెల 14న ఇత్తడి ట్యాప్‌లు, ఇతర సామగ్రి చోరీకి గురయ్యాయి. దొంగలు మూడు గోనె సంచుల్లో ఇత్తడి ట్యాప్‌లు, ఇతర వస్తువులను ఎత్తుకెళ్లారు. చోరీకి ముందు షాపులోని సీసీ కెమెరాల వైర్లను కట్ చేశారు. పక్కా ప్రణాళికతోనే చోరీ జరిగిందని భావించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. షాపులోని సీసీ కెమెరాల్లో గతంలో రికార్డైన దృశ్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో చిలకలూరిపేట ప్రాంతానికి చెందిన దార్ల తిరుపతమ్మ, తాడేపల్లిగూడెంకు చెందిన మింగి మేరమ్మ గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తిరుగుతున్నట్లు గుర్తించారు. వారిపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పగటిపూట గ్రామాల్లో చిత్తు కాగితాలు ఏరుకుంటూ తిరిగే నిందితులు.. అదే సమయంలో చోరీలకు అనుకూలంగా ఉన్న షాపులను గుర్తించేవారు. ఆయా దుకాణాల వివరాలను తమకు పరిచయస్తులైన జయపాల్, ప్రశాంత్‌లకు చేరవేసేవారు. అనంతరం రాత్రి వేళల్లో నలుగురూ కలిసి షాపుల్లో చోరీలకు పాల్పడేవారు.

చోరీ చేసిన ఇత్తడి వస్తువులను అనుమానం రాకుండా వివిధ దుకాణాల్లో విక్రయించేవారు. వచ్చిన డబ్బును నలుగురూ సమానంగా పంచుకునేవారని పోలీసులు తెలిపారు. ఈ ముఠాపై ఇప్పటికే పెదకాకాని, లాలాపేట, గుడివాడ, బందర్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు గుర్తించారు. గతంలో అరెస్టై బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా ఇదే తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

వడ్లమూడి గరువుపాలెంలో చోరీకి ముందు సీసీ కెమెరాల వైర్లను కట్ చేయడం ద్వారా నిందితులు పక్కా ప్రణాళికతో వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి రూ.1.50 లక్షల నగదుతో పాటు చోరీ చేసిన ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

దుకాణాల పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పొన్నూరు రూరల్ సీఐ కృష్ణయ్య ప్రజలకు సూచించారు. తరచూ ఇదే తరహా చోరీలకు పాల్పడుతున్న ముఠా కదలికలపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

 

Loading...
Unable to load recommendations.
Follow Us