వాళ్లంతా ఆదివాసీలు..! వారిలో పెద్దలు ఎవరు అంతగా చదువుకోలేదు. అయినప్పటికీ పిల్లలకు అక్షరాలు నేర్పించేందుకు విద్యాలయాలకు పంపుతున్నారు. వాళ్లు కూడా బుద్ధిగా చదువుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. కానీ అల్లూరి జిల్లా అరకులోయ లో డిగ్రీ కాలేజీలో విద్యార్థులు కళాశాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు. తరగతి గదిలో కూర్చోవాలంటేనే వణికి పోతున్నారు. విద్యార్థులే కాదు ఉపాధ్యాయులకు అదే భయం..! ఈ భయానికి కారణం ఏమిటో తెలుసుకుందాం..
అల్లూరి జిల్లా అరకు లోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం పురాతనమైనది కావడంతో.. శిధిలావస్థకు చేరుకుంటుంది. అయితే కొత్తగా నిర్మిస్తున్న మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు.. ఇంకా పూర్తిగా లేదు. నాలుగేళ్లుగా పనులు నత్త నడకన సాగుతూనే ఉన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా అరకు లోయలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్లాబ్ పెచ్చులు ఊడి పడుతున్నాయి.
దాదాపు రెండు వేల మంది విద్యార్థులు..
వాస్తవానికి అరకులోయలో ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం డిటిసి కోసం గతంలో ఓ భవనాన్ని నిర్మించారు. దాదాపుగా ఆ భవనం నిర్మించి 40 ఏళ్ళు కావస్తోంది. ఈ భవనంలో రెండు వేరు వేరు పూటల్లో.. కో ఎడ్యుకేషన్ ఒకసారి, మహిళా కళాశాల మరొకసారి ఒకరోజులో నిర్వహిస్తున్నారు. కో ఎడ్యుకేషన్ 9 గ్రూపులకు 1100 మంది విద్యార్థులు, ఉమెన్స్ కాలేజీలో 6 గ్రూపులకు దాదాపు 900 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
విద్యార్థుల్లో భయం భయం..!
కాలేజీ భవనంలో 16 తరగతి గదులు ఉన్నాయి. వాటిలో మూడు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. మిగిలిన వాటిలో త్వరగా త్వరగా క్లాసులు నిర్వహిస్తున్నారు. అయితే గత మూడు రోజుల్లో రెండుసార్లు స్లాబుకు ఉన్న పెచ్చులు ఒక్కసారిగా ఊడి పడ్డాయి. ఎవరి మీద పెచ్చులు పడతాయి అన్న భయంతో ఉన్నారు విద్యార్థులు. దీంతో హాజరు వేయించుకుని బయటకు వచ్చేస్తున్నారు. ‘కాలేజీ క్లాసుల్లో కూర్చోవాలంటేనే భయమేస్తోంది. ఏ సమయంలో స్లాబ్ పెచ్చులు తలపై పడతాయేమోనని అనిపిస్తుంది. మూడు రోజుల వ్యవదిలో రెండుసార్లు పెచ్చులు భారీగా ఊడిపడ్డాయి. అందుకే హాజరు వేసుకొని బయటకు వచ్చేస్తున్నాం. నూతన భవనం నిర్మాణం త్వరగా చేసి అందుబాటులోకి తీసుకురావాలి’ అని కోరుతున్నారు విద్యార్థులు.
విద్యార్థులు లేని సమయంలో పెచ్చులు పడడంతో సరిపోయింది. లేకుంటే తలలు పగిలిపోయేంత పని అయ్యేది. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన భవనాన్ని సత్వరమే నిర్మాణం చేపట్టి వాటిలోకి తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు కాలేజీ సిబ్బంది..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..