Andhra Pradesh BJP: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. అమరావతి విగ్రహాల విధ్వంసం కేసులో బీజేపీ కార్యకర్తల పాత్ర ఉందంటూ ఇటీవల రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రక్రటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే డీజీపీ అసత్యాలు చెబుతున్నారని సోము వీర్రాజు ఆక్షేపించారు. డీజీపీ వ్యాఖ్యలపై 20వ తేదీ సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
అయితే సదరు ఆరోపణలపై పోలీసు శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో బీజేపీ నేతలు తదుపరి కార్యాచరణకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, సీఎం రమేష్, విష్ణువర్ధన్ రెడ్డి సహా ఇతర ప్రముఖ నేతలు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే డీజీపీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతారనే సమాచారం అందుకున్న పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ముఖ్యులను హౌస్ అరెస్ట్ చేశారు. ఇప్పటికే దాదాపు 200 మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, తాము ఎలాంటి ముట్టడికి పిలుపు ఇవ్వలేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.
Also read: