ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపట్నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు. కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాధ్ సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో బయోమెట్రిక్ హాజరును పునరుద్దరించాలనే అంశంపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు హజరుపైనా చర్చ జరిగింది.
చాలా మంది కార్యాలయాలకు టైంకు రాకపోవడం.. వచ్చినా బయటకు వెళ్లడం.. సమయం పూర్తి కాకపోయినా ముందుగానే ఆఫీసుల నుండి వెళ్లిపోవడం వంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బయోమెట్రిక్ హజరును పునరుద్దించాలని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖకు తెలిపారు.
ఇకపై హెచ్ఓడి కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, స్యయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు, రాష్ట్ర విభాగాలు, సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని మెమోలో పేర్కోన్నారు. బయోమెట్రిక్ హాజరు నమోదుకు నెలవారీగా నివేదికలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని.. ప్రతీశాఖ కార్యదర్శి ఉద్యోగుల హాజరును బయోమెట్రిక్ ద్వారా పరిశీలించాలని సూచించారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు, జిల్లా కలెక్టర్‌లకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలను జారీ చేశారు.