AP News: ఏపీలో ముదురుతున్న పెన్షన్ల రగడ.. మీరంటే మీరే కారణమంటున్న పాలక, ప్రతిపక్షం!

|

Apr 03, 2024 | 7:04 PM

పెన్షన్ల దుమారం.. ఏపీ రాజకీయాల్లో పెనుతుఫానుగా మారుతోంది. వాలంటీర్లపై ఈసీ ఆంక్షలు మొదలు... పెన్షన్ల పంపిణీపై తాజాగా ప్రభుత్వ ఉత్తర్వుల వరకు.. ప్రతీ పరిణామం కీలకంగా మారింది. నగదు కోసం లబ్ధిదారులు సచివాలయం దగ్గర బారులు తీరడం.. వృద్ధులు ఎండలో అవస్థలు పడటం.. పొలిటికల్‌ పొగలకు కారణమవుతోంది. ఈ పరిస్థితికి మీరంటే మీరే కారణమంటూ పాలక, ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. 

AP News: ఏపీలో ముదురుతున్న పెన్షన్ల రగడ.. మీరంటే మీరే కారణమంటున్న పాలక, ప్రతిపక్షం!
Big News Big Debate
Follow us on

ఏపీ రాజకీయాలు పేదల పెన్షన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఈసీ ఆదేశానుసారం వాలంటీర్లు పక్కకు తప్పుకోవడంతో… పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్నికల కోడ్‌ ముగిసేదాకా… సచివాలయాల దగ్గరే పెన్షన్ల ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అయితే, పెన్షన్‌ కోసం వృద్ధులు ఇతర లబ్ధిదారులు సచివాలయాల దగ్గర బారులు తీరడం… వారిలో కొందరు ఇబ్బందులు పడటం… పొలిటికల్‌గా పెద్దదుమారమే రేపుతోంది. ఇప్పుడీ అంశంపైనే. ప్రధాన పార్టీలన్నీ.. దేనికవే బ్లేమ్‌ గేమ్‌ ఆడుతున్నట్టు కనిపిస్తోంది.

చంద్రబాబు వస్తే మళ్లీ ఇలాంటి పరిస్థితులే వస్తాయంటూ… ప్రజలను హెచ్చరిస్తోంది వైసీపీ. ఇంటి దగ్గరకే నేరుగా పెన్షన్ తీసుకెళ్లి ఇచ్చేలా తమ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తే… అలా జరగకుండా చంద్రబాబు కుట్ర చేశారని ఆరోపించారు ఎంపీ మార్గాని భరత్‌. 58 నెలలుగా 1వ తేదీనే ప్రతీ ఇంటికే వెళ్లి పెన్షన్‌ ఇచ్చామనీ.. కానీ ఇప్పుడు చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు పేర్ని నాని. ప్రజలు ఐదేళ్ల పాలన చూసి ఓటు వేస్తారు గాని, చివరి 2 నెలల్లో డబ్బులు ఇస్తే ఓట్లు వేయరనే విషయాన్ని గుర్తించాలన్నారు.

అయితే, పెన్షన్ల వ్యవహారాన్ని వైసీపీ రాజకీయంగా వాడుకునేందుకు కుట్ర చేస్తోందన్నారు టీడీపీ నేతలు. కదల్లేని వాళ్లకు ఇళ్లదగ్గరే పెన్షన్ ఇవ్వాలనే నిబంధనలున్నా, వైసీపీ నేతలు ప్రచారం కోసం వృద్ధులను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తామన్నారు.

పేదలపై కూటమి కక్ష గట్టిందనీ.. అందుకే ఈసీకి ఫిర్యాదుచేసి పెన్షన్లను ఆపే కుట్ర చేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, వాలంటీర్లపై మాత్రమే ఈసీ ఆంక్షలు విధించిందనీ… పెన్షన్లను ఆపాలని ఎక్కడా చెప్పలేదని ప్రతిపక్ష టీడీపీ చెబుతోంది. తక్షణమే పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలని.. ఈసీకి, సీఎస్‌కు చంద్రబాబు లేఖలు రాశారని గుర్తుచేస్తోంది. మరి, పొలిటికల్‌ మంటలు రేపుతున్న పెన్షన్‌ వ్యవహారానికి ఎక్కడ పుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి. అంతేకాదు, ఆసక్తిరేపుతున్న ఈ పొలిటికల్‌ బ్లేమ్‌గేమ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..