
Big News Big Debate: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో సహజంగానే పార్టీలో రిపేర్లు మొదలుపెట్టారు ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి. వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల్లో కొందరిని పక్కనపెట్టారు.. మరికొందరిని నియోజకవర్గాలు కూడా మార్చారు. అయితే ఇదంతా ఆరంభమేనని.. ఇంకా చాలా మార్పులుంటాయని ముందే హింట్ ఇచ్చింది వైసీపీ నాయకత్వం. అయితే ఇది ప్రత్యర్థిపార్టీలకు రాజకీయ అస్త్రంగా మారితే.. అధికారంలోకి రావడానికి అనివార్యమైన మార్పులే అంటోంది అధికారపక్షం..
తెలంగాణ ఎన్నికలు ముగిశాయి.. ఇక అందరి కన్నూ ఆంధ్రాపైనే ఉంది. ప్రధాన పార్టీలు కూడా బ్యాలెట్ యుద్ధానికి సమాయత్తమవుతున్నాయి. తమదైన వ్యూహాలతో కదనరంగంలోకి దిగుతున్నాయి. అధికారంలో ఉన్న వైసీపీ ఎన్నికలే లక్ష్యంగా అంతర్గత మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజల ఫీడ్ బ్యాక్ ఆధారంగా నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను మారుస్తోంది అధికారపార్టీ. లాయల్టీ ముద్ర ఉన్నా, సీఎంకు సన్నిహితులైనా సరే ప్రజాబలమే ప్రాతిపదికగా మార్పులు చేస్తున్నామంటోంది వైసీపీ. 11 చోట్ల కొత్తవారికి పగ్గాలు అప్పగించిన వైసీపీ త్వరలో మరిన్ని మార్పులుంటాయని స్పష్టం చేసింది. సీఎం జగన్ నిర్ణయమే ఫైనల్ అంటున్నారు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని.
అధికారపార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందంటోంది టీడీపీ. ఎంతమందిని మార్చినా వైసీపీ ఓటమి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు తెలుగుదేశం సీనియర్ నేతలు. అటు మార్చాల్సింది ఇన్‌ఛార్జులను కాదని.. సీఎంను అంటోంది లెఫ్ట్ పార్టీ.
వైసీపీలో మార్పులను క్యాష్ చేసుకోవడానికి రంగంలో దిగింది కాంగ్రెస్. ఇతర పార్టీలకు చెందిన సిట్టింగులతో పాటు.. సీనియర్లు చాలామంది టచ్‌లో ఉన్నారని.. మరో వంద రోజుల్లో అధ్బుతాలు జరుగుతాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగురుద్రరాజు. పదిశాతం మంది పోయినా నష్టం లేదంటున్నారు మాజీ మంత్రి కోడాలి..
మొత్తానికి ఏపీలో వైసీపీ చేస్తున్న మార్పులు అధికారాన్ని రెన్యువల్ చేస్తాయా? తెలంగాణ ఫలితాల తర్వాత ఏపీలోనూ పార్టీల వ్యూహాలు మారాయా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..