Big News Big Debate: ఏపీలో పొత్తుల రాజకీయం రోజుకో మలుపు తీసుకుంటూ ఆసక్తిరేపుతోంది. మేము సింగిల్ అని అధికార వైసీపీ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేయగా.. టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీపై ఉత్కంఠ రేగుతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడంతో దీనిపై మరికొన్ని గంటల్లోనో, రోజుల్లోనో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు పొత్తుల అంశం.. కీలకంగా మారింది. అధికార వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఒక్కటైన టీడీపీ, జనసేన.. బీజేపీతో తుదిచర్చలు జరుపుతున్నాయి. అందులో భాగంగానే కమలం పార్టీ పెద్దలతో మాట్లాడేందుకు ఢిల్లీ వెళ్లారు చంద్రబాబు. ఈ చర్చలు సఫలమైతే.. 2014 పొత్తులు , ఫలితాలు రిపీట్ అవుతాయనే విశ్వాసంతో ఉన్నాయి టీడీపీ వర్గాలు.
అమిత్‌షా – చంద్రబాబు సమావేశం తర్వాత.. అసలు బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు ఉంటుందా? ఉండదా? అనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే పొత్తులో 8 ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు బీజేపీ కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పొత్తు ఖాయమైతే విశాఖ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి బరిలో ఉండనున్నట్టు కూడా ప్రచారమవుతోంది. ఈ స్థానంపై ఆశలు పెట్టుకున్న సీఎం రమేష్‌ను.. టీడీపీ-బీజేపీ రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరో 7 ఎంపీ స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులుగా కీలక నేతల పేర్లు వినిపిస్తున్నాయి.
అయితే, విపక్షాల పొత్తులతో తమకు ఎలాంటి నష్టం లేదంటోంది అధికార వైసీపీ. ఇప్పటికే అవి గాలికి కొట్టుకుపోయే పొత్తులంటూ అసెంబ్లీ సాక్షిగా జగన్ కొట్టిపారేశారు. ఇక, 2014 ఫలితాలు రిపీటయ్యే అవకాశమే లేదన్నారు మంత్రి రోజా. అన్ని పార్టీలు ఒక్కటయ్యాయంటేనే.. వైసీపీ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు మరో మంత్రి కాకాణి.
అయితే, ఇంకా పొత్తు ఖరారు కాకముందే.. విపక్షాల్లో ఆశావహుల నుంచి హాట్ కామెంట్స్ వచ్చేస్తున్నాయి. అనంతపురం ఎంపీ సీటుపై మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.
భారీ సంఖ్యలో ఉన్న ఆశావహుల్ని బుజ్జగించడం.. కూటమి పార్టీలకు పెద్ద తలనొప్పి కావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక, బీజేపీతో టీడీపీ,జనసేన పొత్తు.. రాజకీయంగా ఎవరికి నష్టం, ఎవరికి లాభం? అనే చర్చ కూడా నడుస్తోందిప్పుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..