Eluru Politics: ఏలూరులో నువ్వా నేనా.. అధిష్టానం ఫోకస్ అంతా కాపు సామాజిక ఓటర్ల పైనే!

| Edited By: Balaraju Goud

Jan 07, 2024 | 7:24 PM

రాజకీయాలు నాకేమి కొత్త కాదు అంటున్నారు అక్కడ ఉన్న సీనియర్ పొలిటీషియన్. అయితే ఆయన ఆదమరిచి ఉంటే టికెట్ ఎగరేసుకుపోవటానికి సొంత అనుచరులే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పగలు కౌగిలించుకుంటూ రాత్రులు కత్తులు నూరుకుంటున్నట్లు ఉంది విపక్షాల పరిస్థితి. మొత్తంగా అధికార పార్టీ నేతలు టికెట్ ఎవరికి వస్తుందనే టెన్షన్ ఉంటే, విపక్ష నేతలు మాత్రం నాకు రాకపోయినా ఫర్వాలేదు ఆయనకు రాకూడదు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది.

Eluru Politics: ఏలూరులో నువ్వా నేనా.. అధిష్టానం ఫోకస్ అంతా కాపు సామాజిక ఓటర్ల పైనే!
Eluru Politics
Follow us on

రాజకీయాలు నాకేమి కొత్త కాదు అంటున్నారు అక్కడ ఉన్న సీనియర్ పొలిటీషియన్. అయితే ఆయన ఆదమరిచి ఉంటే టికెట్ ఎగరేసుకుపోవటానికి సొంత అనుచరులే సిద్ధంగా ఉన్నారు. మరోవైపు పగలు కౌగిలించుకుంటూ రాత్రులు కత్తులు నూరుకుంటున్నట్లు ఉంది విపక్షాల పరిస్థితి. మొత్తంగా అధికార పార్టీ నేతలు టికెట్ ఎవరికి వస్తుందనే టెన్షన్ ఉంటే, విపక్ష నేతలు మాత్రం నాకు రాకపోయినా ఫర్వాలేదు ఆయనకు రాకూడదు అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ గందరగోళం ఎక్కడ జరుగుతుందో తెలుసా ఏలూరులో.. ఇక్కడ రాజకీయాలకే రాజకీయం నేర్పగల ఉద్దండులు ఉన్నారు.

ఏలూరు నియోజకవర్గంలో రాజకీయ పోరు ఏప్పుడు అధికార ప్రతిపక్షాల మధ్య నువ్వా నేనా అనే విధంగా సాగుతుంది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నానిని మార్చి కొత్త అభ్యర్థిని ఈసారి బరిలో నిలబెడతారనే ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఎలా ఉన్నా సీఎం జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు ఆళ్ల నాని. ఆయన కాదని వేరే వ్యక్తికి టికెట్టు ఇవ్వటం అంటే ఆడో మిరాకిల్ గానే స్థానికులు భావిస్తున్నారు. ఏలూరులో రెండున్నర లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా అందులో 60 వేలకు పైగా కాపు, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. గతంలో ఒకటి రెండు సార్లు మినహా ఏప్పుడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.

గత ఎన్నికల్లో ఎంతోమంది ఏలూరు టిక్కెట్టును ఆశించినప్పటికీ ఎమ్మెల్సీగా ఉన్న ఆళ్ళ నానికే సీఎం జగన్ టికెట్ ఇచ్చి బరిలోకి దించారు. అయితే ఇటీవల పలుచోట్ల వైసీపీ అభ్యర్థుల మార్పుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఇప్పటికే పలు నియోజకవర్ంగాల అభ్యర్థులకు మార్పులు చేర్పులు చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే నానికి దీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనే అంతస్థాయిలో ఉన్న అభ్యర్థులు ఉన్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు ప్రముఖ పారిశ్రామికవేత్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అలియాస్ జె పి పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే జేపీ కూడా నాని అనుచరుడే కావడం విశేషం.

అప్పటి నుంచి నానితో సన్నిహిత సంబంధాలు దెబ్బతిన్నాయని పలువురు భావిస్తున్నారు. ఇక మరో నేత ఏలూరు మాజీ ఏఎంసీ చైర్మన్ మంచం మై బాబు. ఈయన కూడా నానికి వీర విధేయుడు. అయితే ఈసారి వైసీపీ అధిష్టానం తనను మార్చే ఆలోచనలో ఉంటే టికెట్ మై బాబుకు ఇవ్వాలని నాని కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక జెపి తన శ్రీమతికి మేయర్ పదవి కోరినట్లు ప్రచారం జరుగింది. అది సాధ్యంకాకపోవటంతో నానికి జె జె పి కి మధ్య విభేదాలు వచ్చాయి. గతంలో ఒకటి రెండు సార్లు జెపి అలిగి నానికి దూరంగా ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ఈసారి వీరిమధ్య గ్యాప్ బాగా పెరిగింది. అధిష్టానం దగ్గర జెపి తన పలుకుబడినంతా ఉపయోగిస్తున్నారట. ఇప్పటికిపుడు తన వెంట 6 నుంచి ఏడుగురు కార్పొరేటర్లు బయటకు వచ్చేసే విధంగా ఎత్తగడలు రూపొందించారని టాక్ వినిపిస్తుంది. తన కుటుంబ చరిత్ర , కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లో తనకు వున్నా అనుభవం దృష్ట్యా పార్టీ టికెట్ తనకు ఇస్తుందని జెపి బాహాటంగానే ఆశిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు పోటీలో ఉంటానా లేదా అనే విషయంపై ఆళ్ల నాని స్పష్టత ఇవ్వకపోగా మౌనంగా వుండిపోయారు. అయితే తన మనుస్సులో ఏముందనేది బయటకు చెప్పకపోవటం ఆయనకు సహజంగా వున్నా లక్షణం. అత్యంత సన్నిహితంగా వుండే వారితో సైతం నాని ఒకటి, రెండు మాటలు మాట్లాడి విషయాన్ని తేల్చేస్తారు. యువజన కాంగ్రెస్ లీడర్ గా రాజకీయ ప్రస్తానం మొదలు పెట్టిన నాని ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. తరువాత 2004 లో వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో నాని తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. 2009 లోనూ గెలిచిన ఆయన వైఎస్ మరణం తరువాత చివరిగా జగన్ నాయకత్వంలో వైసీపీలో చేరారు. 2014 లో టికెట్ లభించినా, తెలుగు దేశం పార్టీ అభ్యర్థి బడేటి బుజ్జి చేతిలో ఓడిపోయారు.

2017 లో ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆళ్ళ నాని ఆ పదవిలో ఉండగానే 2019లో తిరిగి అసెంబ్లీ కి పోటీ చేసి బుజ్జిపైనే గెలిచారు. సీఎం జగన్ తొలి కేబినెట్‌లో ఉపముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. రొటేషన్ కోసం మంత్రి పదవిని వదులుకోవలసిన సందర్భంలో నాని తీవ్రంగా మనస్థాపానికి గురైనట్లు చెబుతారు ఆయన సన్నిహితులు. చాలాకాలం బయటకు రాకపోవటం, కేవలం సమీక్షలకు పరిమితం కావటం, ఈలోగా మిగిలిన నేతలు అధిష్టానానికి లోకల్ విషయాలు చేరవేయడంలో విజయవంతం కావటంతో నానికి మైనస్‌గా మారిందట. ఇది తనకు వీరవిధేయులుగా వున్నవారు సైతం టికెట్ ఆశించే స్థాయికి చేరుకుందట. అయితే 2024 ఎన్నికల్లోనూ నేను బరిలో ఉంటానని నాని స్పష్టంగా తన అంతరంగికుల వద్ద చెబుతున్నారు. ఆయనే నిలబడితే కొందరు వెనక్కు తగ్గుతారు. కానీ అయన కాకుండా మరొకరు ఉంటే విపక్షంలోనూ నేతలు మరి పోటీలో వుండే అభ్యర్దుల పేర్లు మారిపోయేంతగా ఏలూరు రాజకీయంమారిపోతుంది అని ప్రచారం జరుగుతుంది.

మరోవైపు పలు రకాల సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికలంటే ఒక్క అభ్యర్థి విషయమే కాదు ఆర్థికంగా వారి బలాబలాలను సైతం లెక్కలోకి తీసుకుంటారట. ఈ క్రమంలో జెపి ఆర్థికంగా కాస్త బలమైన వ్యక్తి కావడంతో ఆయనకే సైతం టిక్కెట్టు దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అయితే నానినీ కాదని జెపికి టికెట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైతే నాని ఖచ్చితంగా తన రాజనీతిని ప్రదర్శించకమన్నారు. తన అనుచరుల్లోనే ఒకరికి టికెట్ దక్కే విధంగా అయన వ్యవరిస్తారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి వారిలో మంచెం మై బాబు పేరు ప్రచారంలో ఉంది. గతంలో ప్రజారాజ్యం లో మైబాబు చురుకుగా ఉన్నారు. వైఎస్ మరణం తరువాత నానితో పాటు పార్టీని విడి వైసీసీ లో చేరిపోయారు. అప్పటి కాంగ్రెస్ పెద్దలు మైబాబును బరిలో దింపేందుకు సైతం ప్రయత్నించారు. ఇలా తనకు ఉన్న బలం , పొలిటికల్ అనుభవంతో మై బాబు సైతం టికెట్ ఆశిస్తున్నా అది నాని కనుసన్నల్లో అయితేనే అవకాసం కనిపిస్తుంది. ఇక మరోవైపు 2019లో వైసీపీ టికెట్ మధ్యాహ్నపు బలరాం కుటుంభానికి దక్కుతుందని భావించారు. కానీ నాని పోటీ చేయటంతో బలరాం తన రాజకీయ గురువు కోటగిరి విద్యాధరరావు కుమారుడు శ్రీధర్ ముఖ్య అనుచరుడిగా ఉండిపోయారు. తరువాత ఏలూరు డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ పదవి దక్కినా ప్రస్తుతం ఆపదవిని మరొకరికి కట్టబెట్టడంతో బలరాం తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు . ఆయన నానికి దూరంగా రాజకీయం నెరపుతున్న పరిస్థితి ఏలూరులో కనిపిస్తుంది.

ఇక ఏలూరులో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ సైతం బలంగా ఉంది. ఈసారి జనసేనతో పొత్తు వారికి బాగా కలిసొచ్చే అంశం. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆళ్ల నాని టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై కేవలం 4 వేల ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల అనంతరం గుండెపోటుతో బడేటి బుజ్జి మరణించడంతో ఏలూరు టీడీపీ ఇన్‌చార్జిగా ఆయన సోదరుడు బడేటి చంటి బాధ్యతలు చేపట్టారు. పార్టీ కార్యక్రమాలు జోరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో చంటి సక్సెస్ అయ్యారు. అయితే ఈసారి టీడీపీకి ఇక్కడ కొత్త చిక్కు వచ్చి పడింది. టీడీపీ – జనసేన పోత్తులో భాగంగా ఏలూరు టికెట్‌ను జనసేన కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాక గత ఎన్నికల్లో సైతం టీడీపీ ఓటమికి ఏలూరులో జనసేనే ప్రధాన కారణం అని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పోటీలో ఉండి సుమారు 16 వేల ఓట్ల పైగా రాబట్టారు. టీడీపీ ఓట్లే భారీగా చీలి జనసేనకు పడ్డాయని, దాంతోనే ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఓటమిపాలయ్యారని టాక్ ఉంది.

అయితే ఇక్కడ కాపు సామాజిక వర్గం ప్రభావం ఎక్కువ ఉండడంతో మొదటి ప్రాధాన్యతగా ప్రధాన పార్టీలు కాపు సామాజిక నేతల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే అటు వైసిపి నుంచి ఎమ్మెల్యే ఆళ్ల నాని, జయప్రకాష్, మై బాబు , బలరాం అదేవిధంగా టీడీపీ ఇంచార్జ్ చంటి కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు. జనసేన ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. అంతేకాకుండా కార్మిక నాయకుడు కావడం ఆయనకు కలిసి వచ్చే అంశం. దాంతో ఇక్కడ రాజకీయం రసపట్టుగా మారింది. టీడీపీ జనసేన మధ్య ప్రస్తుత పరిస్థితి కాపు వర్సెస్ తూర్పు కాపుగా మారిపోయింది. జనసేన సైతం ఏలూరు టికెట్‌ను ఆశిస్తుంది. పొత్తులో భాగంగా జనసేనకు ఏలూరు టికెట్ ఇస్తే తప్పకుండా గెలిచి తీరుతామని జనసేన నేతలు భావిస్తున్నారు. అయితే టీడీపీ సైతం టికెట్ను వదులుకోవడానికి సిద్ధంగా లేదనే టాక్ వినిపిస్తోంది. జనసేన సపోర్ట్‌తో టికెట్‌ను టీడీపీకి ఇస్తే భారీ మెజారిటీతో గెలిచి తీరుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా కాకపోయినా ఇక్కడ టీడీపీ – జనసేనకు మధ్య అంతర్గతంగా టికెట్ వార్ నడుస్తుందట. ఎవరి ప్రయత్నాల్లో వారు జోరుగా పావులు కదుపుతున్నారట. ఏది ఏమైనా సరే ఫైనల్ గా అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా భావించే అవకాశం ఉందని పలువురు నేతలు భావిస్తున్నారు.

అయితే ఏలూరులో నువ్వా నేనా అనే ఎన్నికలు జరగనున్నాయి.. అధిష్టానం ఫోకస్ అంతా కాపు సామాజిక ఓటర్ల పైనే దృష్టి సారిస్తున్నారు. మెజారిటీ ఓట్లు ఆ సామాజిక వర్గానికి ఉండడంతో వారిని తమ పార్టీల వైపు ఆకర్షించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే వైసీపీలో ఉన్న అంతర్గత వర్గ పోరు నేపథ్యంలో నానికి టికెట్ ఇస్తే పూర్తిగా అసమ్మతి నేతలు పూర్తిగా సహకరిస్తారా…? లేక నాని అనుచరుడైన మై బాబు కి టికెట్ కేటాయిస్తే పరిస్థితి ఏంటి..? ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు ఆశావాహులు ఇతర పార్టీ నేతలతో టచ్ లో ఉన్నారని ప్రచారం నేపథ్యంలో ఎంతవరకు వైసీపీ విన్ అయ్యే అవకాశాలు ఉన్నాయో అర్థం కాని పరిస్థితి. ఇక జెపికి వైసిపి టికెట్ కేటాయిస్తే నాని వర్గం పూర్తిస్థాయిలో ఆయనకు సహకరించే అవకాశం లేదని బహిరంగంగానే ప్రచారం జరుగుతుంది. ఇక టీడీపీ జనసేన విషయానికి వస్తే.. ఎవరికివారు టికెట్టు దక్కించుకునే ప్రయత్నాల్లో ఉండి.. మరోపక్క అధిష్టానం నిర్ణయమే శిరోధారిమంటు తీరా పొత్తులో టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన పూర్తి సహకారాలు అందిస్తుందా..? లేక జనసేనకే టికెట్ కేటాయిస్తే టిడిపి నేతలు జనసేనతో కలిసి వారి గెలుపునకు ఎంతవరకు సహకరిస్తారనేది నియోజకవర్గంలో తీవ్ర చర్చినియాంసంగా మారింది. ప్రస్తుతం అయితే ఏలూరులో అధికార ప్రతిపక్ష పార్టీలలో గజిబిజి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని స్పష్టమవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…