CBN Arrest: సోమవారం చంద్రబాబు కేసుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశం
3 కోర్టులు...6 తీర్పులు. బెజవాడ ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా...సోమవారం చంద్రబాబు కేసుల్లో కీలక పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇన్నర్‌రింగ్ రోడ్, ఫైబర్‌నెట్, అంగళ్లు కేసులో ముందస్తు బెయిల్‌పై హైకోర్టు తీర్పు రానుంది. ఇక స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్, పోలీస్ కస్టడీపై ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ ఇవ్వనుంది. ఇంతకీ బిగ్ డే నాడు ఏం జరగనుంది?
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టయి నెల రోజులు అయిపోయింది. నంద్యాలలో అరెస్ట్ దగ్గర్నుంచి రిమాండ్, పిటిషన్లు, విచారణలతో.. చంద్రబాబు ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. స్కిల్ స్కామ్ కేసు రాజకీయ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తుంటే.. అన్ని ఆధారాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని అధికార వైసీపీ కౌంటర్ అటాక్‌కి దిగుతోంది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో అప్పుడే చంద్రబాబు అరెస్ట్ అయి ముప్పై రోజులు గడిచిపోయింది.
ప్రాజెక్ట్ యాత్రలో భాగంగా నంద్యాలలో బస చేసిన చంద్రబాబును సెప్టెంబర్ 9న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా.. నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. తీవ్ర వాగ్వాదం మధ్య చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు సీఐడీ అధికారులు. అరెస్ట్ అనంతరం ఆయన కాన్వాయ్‌లోనే విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు.
స్కిల్ స్కామ్‌లో కేసులో చంద్రబాబు అరెస్ట్, పిటిషన్లు, విచారణకు సంబంధించిన స్కిల్ కేసు డైరీ తిరగేస్తే పరిణామాలు చకచకా సంభవించాయి. –సెప్టెంబర్ 9న చంద్రబాబు అరెస్ట్ –సెప్టెంబర్ 10న రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు –సెప్టెంబర్ 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు –సెప్టెంబర్ 14న ఏసీబీ కోర్ట్‌లో బెయిల్ పిటిషన్ –సెప్టెంబర్ 15కి బెయిల్ పిటిషన్ వాయిదా –సెప్టెంబర్ 19న రిమాండ్ సస్పెండ్ చేయాలని, ఎఫ్‌ఐఆర్ కొట్టెయ్యాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు. –సెప్టెంబర్ 22న రెండు రోజుల సీఐడీ కస్టడీ విధించిన ఏసీబీ కోర్టు –సెప్టెంబర్ 22న హైకోర్ట్‌లో క్వాష్ పిటిషన్ డిస్మిస్ –సెప్టెంబర్ 24వరకు చంద్రబాబు రిమాండ్ పొడిగింపు –అక్టోబర్ 5న మరోసారి రిమాండ్ పొడిగింపు –అక్టోబర్ 19వరకు జ్యుడీషియల్ రిమాండ్ –అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్‌పై వాదనలు –అక్టోబర్ 9కి సుప్రీంలో క్వాష్ పిటిషన్‌పై విచారణ –అక్టోబర్ 9న హైకోర్టులో ఇన్నర్‌రింగ్ రోడ్, అంగళ్లు, ఫైబర్‌నెట్ కేసుల్లో ముందస్తు బెయిల్‌పై తీర్పు –అక్టోబర్ 9న బెయిల్, కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పు
స్కిల్ కేసుకి సంబంధించి చంద్రబాబు తరఫున న్యాయవాదులు వాదనలు చూస్తే…అరెస్ట్ అక్రమం, అన్యాయం. 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు. ఇది రాజకీయ ప్రతీకారం. విచారణ ప్రక్రియ అపహాస్యం. డిజైన్‌టెక్ నుంచి విరాళాలు రాలేదు. బెయిల్ రాకుండా ఉద్దేశపూర్వక కుట్ర చేస్తున్నారంటూ బాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆయన తరఫున సిద్ధార్థ లూధ్రా, హరీష్ సాల్వే, దూబే, అగర్వాల్ వంటి హేమాహేమి లాయర్లు…ఏసీబీ కోర్టు నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వాదనలు వినిపించారు.
ఇక సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ముకుల్ రోహత్గీ మొదట్లో వాదిస్తే తర్వాత ఏపీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రమణ్యం కూడా జాయిన్ అయ్యారు. స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, చంద్రబాబుకు 17A వర్తించదని, షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపు జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లిందని, టీడీపీ ఖాతాలోకి 27 కోట్ల రూపాయలు వెళ్లాయని, దీనిపై మరింత లోతుగా విచారించాల్సిన అవసరం ఉందని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సంబంధించి అక్టోబర్ తొమ్మిదవ తేదీ..బిగ్ డేగా మారనుంది. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కూడా తీర్పు రానుంది. ఇక ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై కూడా సోమవారం నాడే హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో సోమవారం చంద్రబాబుకు అత్యంత కీలకంగా కనిపిస్తోంది.
హైకోర్టులో కేసులకు సంబంధించి…అంగళ్లు కేసులో నిందితులు అందరికి బెయిల్ ఇచ్చేశారు కాబట్టి…చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందంటున్నారు న్యాయవాది వెంకటేష్ శర్మ. అయితే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబు తరఫు లాయర్లు.. రెండు రకాలుగా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారని ఆయన చెబుతున్నారు. చంద్రబాబు కస్టడీలో లేరు కాబట్టి…ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఆయనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ ఏజీ శ్రీరామ్ సుబ్రమణ్యం వాదించారని న్యాయవాది శర్మ తెలిపారు.ఇక ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి కీలక సాక్షి వాంగ్మూలం ఆధారంగా చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని ఏజీ వాదించారని న్యాయవాది శర్మ తెలిపారు. ఇక ఏసీబీ కోర్టుకు సంబంధించి చంద్రబాబును మరోసారి కస్టడీకి ఇవ్వకపోవచ్చని అడ్వొకేట్ శర్మ అభిప్రాయపడ్డారు. అయితే బాబుకు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చన్నారు ఆయన. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబుకు సెక్షన్ 17A వర్తించదని సీఐడీ తరఫు న్యాయవాదులు వాదించారని అడ్వొకేట్ శర్మ తెలిపారు. మొత్తానికి చంద్రబాబు కేసులకు సంబంధించి సోమవారం బిగ్ డేగా మారే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.