
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం… కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు. నిర్మాణ పనుల్ని పరిశీలించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. టాక్సీవే , రన్‌వే నిర్మాణాల్ని పర్యవేక్షించారు. ముఖ్యంగా, కుండపోత కురిసినప్పుడు, నీళ్లు నిలవకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఎన్ని సమస్యలు ఎదురైనా అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, డిసెంబర్ లేదా జనవరిలో టెస్ట్ ఫ్లయిట్ ఎగరబోతోందని చెప్పారు. కనెక్టివిటీ పెంచడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఇప్పటికే ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఎకనమిక్ ఆక్టివిటీ పెరుగుతోందని, త్వరలో ఫైవ్‌స్టార్ హోటల్స్ కూడా వస్తాయని, ఏవియేషన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని భరోసానిచ్చారు. ప్రస్తుతం వైజాగ్ విమానాశ్రయం నుంచి సేవలందించని ఎయిర్‌లైన్ సంస్థల్ని కూడా ఇక్కడికి రప్పించేలా మంతనాలు జరుపుతోంది ఏవియేషన్ శాఖ.
విశాఖను త్వరలో AI (Artificial Intelligence) హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. గ్లోబల్ స్టాండర్డ్స్‌కి అనుగుణంగా ఈ ఎయిర్‌పోర్ట్‌ను నిర్మిస్తున్నామని, నావిగేషన్, ట్రాఫిక్ కంట్రోల్ వంటి అంశాలన్నీ ఏవియేషన్ మినిస్ట్రీ పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని తెలిపారు. విశాఖలో జరగబోయే పారిశ్రామిక సదస్సులో ఏవియేషన్ రంగానికి చెందిన ప్రధాన కంపెనీలను ఆహ్వానించనున్నట్లు మంత్రి తెలిపారు. పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నట్లు ప్రకటించారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ కథనాల కోసం క్లిక్ చేయండి.