Badvel By Election Results 2021: బద్వేలులో తిరుగులేని వైసీపీ.. ఏడు రౌండ్లకే 60 వేల భారీ మెజారిటీ

|

Nov 02, 2021 | 11:44 AM

Badvel By Poll Result Counting Live Updates: బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాల్లో ఇప్పటికి వెలువడిన ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యత వేలల్లోనే ఉంటూ వచ్చారు.

Badvel By Election Results 2021: బద్వేలులో తిరుగులేని వైసీపీ.. ఏడు రౌండ్లకే 60 వేల భారీ మెజారిటీ
Badvel By Election
Follow us on

Badvel By Election Result Live Counting:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతం జిల్లా కడపలోని బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితాల్లో అధికార వైసీపీ స్పష్టమైన అధిక్యతను కనబరుస్తోంది. ఇప్పటికి వెలువడిన ప్రతి రౌండ్ లోనూ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధా ఆధిక్యత వేలల్లోనే ఉంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఏడు రౌండ్ల ఫలితాలు వెల్లడి అవ్వగా, ఇప్పటికే 60 వేల పైచిలుకుగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రతి రౌండ్‌లోనూ ఇదే దూకుడు కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యం వచ్చింది.. తొలి రౌండ్‌లో వైసీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైసీపీదే ఆధిక్యం కనిపించింది. బద్వేలులో భారీ విజయం దిశగా వైసీపీ దూసుకుపోతోంది. వైఎస్సార్‌సీపీ ఆధిక్యత 50 వేలు దాటింది. ఏడో రౌండ్‌ పూర్తయ్యేసరికి మొత్తం 98,104 ఓట్లను లెక్కించారు. ఇందులో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధాకు 74,991 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి పనతల సురేష్‌కు 14,286 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కమలమ్మకు 4,252 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధకు 60,765 ఓట్ల ఆధిక్యత లభించింది.

బద్వేల్ పట్టణంలోని గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో కౌంటింగ్ కొనసాగుతోంది. కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకోసం నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్‌ జారీచేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్‌ ఏర్పాటుచేశారు. ఆర్వో ఉన్న కౌంటింగ్‌ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కిస్తారు. ర్యాండమ్‌ చెకింగ్‌ కోసం ఒక వీవీ ప్యాట్‌ కేంద్రం ఏర్పాటుచేశారు.

ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశముందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇదిలావుంటే, వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య మరణించడంతో క‌డ‌ప‌ జిల్లా బద్వేలు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార ప‌క్షం.. ఆన‌వాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేలు టికెట్ ను డాక్టర్ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధకు కేటాయించింది. అయితే, సంప్రదాయాన్ని గౌరవిస్తూ.. ప్రధాన ప్రతిప‌క్షం తెలుగు దేశం ఈ ఎన్నిక‌లో పాల్గొన‌డం లేద‌ని ముందుగానే స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాల‌ని భావించినా సెంటిమెంట్‌, ఆన‌వాయితీని పాటించాల‌ని నిర్ణయం తీసుకొంది. అంతే కాకండా గ‌త ఎన్నిక‌ల్లో ఎక్కువ‌గా ప్రభావం చూపుకున్నా.. ప్రతిప‌క్షంలా ప్రశ్నిస్తామంటూ నిరంతం ప్రజ‌ల్లో ఉండే ప్రయ‌త్నం చేస్తున్న జ‌న‌సేన కూడా పోటీ నుంచి త‌ప్పుకొంది. అయితే ఎన్నిక‌ల్లో రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్‌, బీజేపీ పోటీలో నిలిచాయి.

ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక… BJP పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో YCP అభ్యర్ధిగా డాక్టర్ వెంకటసుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయితే ఆయన అకాల మరణంతో ఉపఎన్నిక రావడంతో …ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే…గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే వచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్దిని బరిలోకి దింపింది. మరి ఈ సారి ఎలాంటి ఫలితం సాధిస్తుందో చూడాలి.. బీజేపీ నేతలు మాత్రం టీడీపీ, జనసేన ఓట్లపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అందుకు ప్రభుత్వానికి గట్టి పోటీ ఇచ్చి తీరుతామని అంటున్నారు.