కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం భయాందోళన కలిగిస్తోంది. ఈ పులి విశాఖ జిల్లా(Vizag District) వైపు వెళ్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. తుని మండలంలోని మరువాడ గ్రామ శివారులోని జీడితోటలో పులి పాదముద్రలను గుర్తించారు. కాగా.. గత రాత్రి కుమ్మరిలోవలో మనుషుల కంటపడింది. ఇవాళ, రేపు పులి వెనక్కి రాకపోతే విశాఖ జిల్లాలోకి వెళ్లినట్లు నిర్ధారిస్తామని అధికారులు చెబుతున్నారు. కాగా.. పులి సంచరిస్తున్న గ్రామాల్లోని ప్రజలను అప్రమత్తం చేసినట్లు ఫారెస్ట్ రేంజర్ ధర్మరాజు తెలిపారు. కాకినాడ(Kakinada) జిల్లాలో నెలరోజులుగా సంచరిస్తున్న పెద్దపులి అధికారులను(Tiger Wandering) ముప్పుతిప్పలు పెడుతోంది. దాన్ని పట్టుకోవడానికి ఎన్ని ఎత్తులు వేసినా, చిక్కకుండా తిరుగుతోంది. కాగా.. ఇప్పటివరకు సీసీ కెమెరాలకే పరిమితమైన పులిని ఓ వ్యక్తి చూశాడు. రౌతులపూడి మండలం యస్.పైడపాల గ్రామంలో పట్టపగలే సంచరిస్తున్న పులిని చూసి అవాక్కయ్యాడు. పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటున్నామని, పొలాలకు వెళ్లలేకపోతున్నామని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.
పోతులూరు, ఒమ్మంగి, పొదురుపాక పాండవులపాలెం, శరభవరం గ్రామాల మధ్య సరుగుడు తోటలు, దట్టమైన చెట్లతో ఉండే మెట్టల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వసతి సౌకర్యంగా ఉండటంతో పులి ఇక్కడే ఉంటూ వేటాడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.పులిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది పొదురుపాక, శరభవరం, ఒమ్మంగిలో మూడు బోన్లు ఏర్పాటు చేసి పశు మాంసం ఎరగా వేశారు.