Itlu Mee Niyojakavargam: జమ్మలమడుగులో జంక్షన్‌ జామ్‌.. జబర్దస్త్‌ పాలిటిక్స్‌.. మారిన పబ్లీక్ మూడ్..

|

Mar 09, 2023 | 7:32 PM

జమ్మలమడుగులో జబర్దస్త్‌ పాలిటిక్స్‌ తప్పేలా లేవ్‌ ఈసారి. అసలే జంక్షన్‌ జామ్‌ అయినట్టుగా ఉండే అక్కడి రాజకీయం... మరింత వేడెక్కుతోంది. అలసింతకూ నియోజకవర్గంలో పరిస్థితేంటి? అభివృద్ధి ముచ్చట్లేంటి? సంక్షేమం సంగతులేంటి?ఎమ్మెల్యే ఇచ్చిన హామీల్లో అమలైనవెన్ని? ఇంకా పరిష్కారం కాని సమస్యలెన్ని? జనాల అభిప్రాయం ఎలా ఉంది?

Itlu Mee Niyojakavargam: జమ్మలమడుగులో జంక్షన్‌ జామ్‌.. జబర్దస్త్‌ పాలిటిక్స్‌.. మారిన పబ్లీక్ మూడ్..
Itlu Mee Niyojakavargam
Follow us on

2024ఎన్నికలు సమీపిస్తున్న వేళ… వైఎస్‌ఆర్‌ కడప జిల్లా జమ్మలమడుగులో పరిస్థితులు మెల్లమెల్లగా మారిపోతున్నాయి. ఫ్యాక్షన్‌కు నిలువెత్తు నిదర్శనంలా, హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ ప్రాంతంలో… ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. జనాల్లో అభివృద్ధిపైనా, శాంతియుత పరిస్థితులపైనా… అవేర్‌నెస్‌ పెరగడం కూడా దీనికి కారణంగా కనిపిస్తోంది. అంతేకాదు, రాజకీయంగా ఎంత రచ్చ ఉన్నా.. నేతల తీరులోనూ అదే మార్పు కనిపిస్తోంది.

కడప జిల్లాలో అత్యధిక పరిశ్రమలు కలిగిన ప్రాంతంగా ఉన్న జమ్మలమడుగులో… రాజకీయ కక్షలు ఎక్కువగానే ఉండేవి. అందుకే, అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందనే అభిప్రాయం ఉంది. అయితే, పది, పదిహేనేళ్లనుంచి ఇక్కడ సీన్‌ మారింది. ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చింది. మాజీ మంత్రులు ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిల కుటుంబాలు.. ఫ్యాక్షన్‌లో పోటాపోటీగా తలపడుతూ.. ఈ నియోజకవర్గాన్ని కనుచూపుతో శాసించాయ్‌. ఎన్నికలు ఎప్పుడొచ్చినా.. నిప్పులు ఎగిసిపడేవి. అయితే, ఇప్పుడీ రెండు కుటుంబాలు కొంత స్దబ్దుగా ఉండటంతో ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది.

2014 తర్వాత ఒక్కటైన ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి

2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డి టిడిపిలోకి జంపయ్యారు. అప్పటికే టీడీపీలో ఉన్న రామసుబ్బారెడ్డి… ఇష్టం లేకపోయినా అధిష్టానం ఒత్తిడితో ప్రత్యర్థి రాకను అంగీకరించాల్సి వచ్చింది. అప్పుడు టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి… ఒప్పుకోక తప్పలేదని రామసుబ్బారెడ్డి అనుచరులు చెబుతుంటారు. అయితే, 2019లో జమ్మలమడుగు అనూహ్య పరిణామాలకు వేదికైంది. వైసీపీ తరపున పోటీచేసిన సుధీర్‌రెడ్డి విజయం సాధించారు. టీడీపీ నుంచి బరిలో ఉన్న రామసుబ్బారెడ్డి… ఆదినారాయణ రెడ్డి సపోర్ట్ ఇచ్చినా గెలవలేకపోయారు. దీంతో, దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల హవా తగ్గిందనే టాక్‌ మొదలైంది.

ఆ రెండు కుటుంబాలు కలిసినా.. సుధీర్‌రెడ్డిదే గెలుపు

జమ్మలమడుగులో బలమైన రాజకీయ కుటుంబాలుగా ముద్రేసుకున్న దేవగుడి, గుండ్లకుంట కుటుంబాలు ఏకమైనా… కొత్తగా రాజకీయాల్లోకి సుధీర్‌రెడ్డిని ఓడించలేకపోయాయ్‌. ఎన్నో ఏళ్లుగా ప్రత్యర్థులుగా ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి చేతులు కలిపినా కూడా… భారీ మెజార్టీతో గెలిచాడు ప్రత్యర్థి. దీంతో, జమ్మలమడుగులో అటు రాజకీయం, ఇటు ప్రజలూ మునుపటిలా లేరన్నది స్పష్టంగా తెలుస్తోంది.

టీడీపీలో కీలకంగా మారిన భూపేశ్‌రెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి

2019లో ఊహించని పరిణామాలతో… జమ్మలమడుగు రాజకీయాలు మరో టర్న్‌ తీసుకున్నాయి. మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి బిజెపి తీర్థం పుచ్చుకోగా… మరో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అధికార పక్షానికి చేరువయ్యారు. ఆదినారాయణ రెడ్డి సోదరుడు, మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాత్రం కుమారుడు భూషేశ్‌రెడ్డితో కలిసి టీడీపీలోనే కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి సైతం సైకిల్‌ను వదల్లేదు. ఈసారి ఎలాగైనా జమ్మలమడుగులో పచ్చజెండా ఎగరేసి తీరుతామంటున్నారు.

ప్రస్తుతం ఒకే ఒకరలో సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి

అయితే, అధికార వైసీపీలో అదోరకంగా తయారైంది పరిస్థితి. గత ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపబడిన రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డి.. ఇప్పుడు ఒకే ఒరలో ఉన్నారు. దీంతో, వచ్చే ఎన్నికల్లో ఎవరికివారు.. వైసీపీ తరపున తామే పోటీచేస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం రచ్చరేపుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఉన్నప్పటికీ… తనకు ఛాన్సివ్వాలంటూ రామసుబ్బారెడ్డి ప్రయత్నిస్తుండటం పరిస్థితిని ఆసక్తికరంగా చేసింది. అటు దేవగుడి ఫ్యామిలీ నుంచి బిజెపి తరపున ఆదినారాయణ రెడ్డి, టీడీపీ తరపున ఆయన అన్నకుమారుడు భూపేష్ రెడ్డి… వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు. దీంతో ఇక్కడ పాలిటిక్స్‌ కనులవిందు కావడం ఖాయమంటున్నారు లోకల్‌ జనం.

ఎవరు పోటీచేసినా, ఎవరు పోటీచేయకపోయినా… నియోజకవర్గంలో హామీల అమలు… పరిష్కారం కాని సమస్యలు… వచ్చే ఎన్నికలకు కీలకం కానున్నాయి.

గండికోట జలాశయం నిర్వాసితుల సమస్యలు యథాతథం!

గండికోట జలాశయం నిర్మాణం పూర్తయిపోయింది కానీ, నిర్వాసితుల సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. వైసీపీ సర్కార్‌ పరిహారం పెంచినా అందరికీ అందలేదు. పునరావాస గ్రామాల్లో మాలిక వసతులు కూడా లేవు. మరోవైపు రాజోలి జలాశయం… ప్రతిపాదనగానే మిగిలిపోవడంపై రైతులు అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయంలో ముంపు గ్రామాలకు దక్కాల్సిన పరిహారం విషయంలోనూ చర్యల్లేవు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్‌కి సంబంధించిన నిధులు కూడా అందలేదు. ఇక, వారికి కేటాయించిన స్థలాలలో… భూమిలోంచి నీటి ఊటలు వస్తుండటం ఇబ్బందికరంగా మారింది.

మందుకు కదలని కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం

కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఇంకా మొదలు కాకపోవడం.. ఇక్కడ యువతను నిరాశపరుస్తోంది. జిందాల్ కంపెనీతో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని వైసీపీ వర్గాలు చెబుతున్నా… ఎన్నికల ముందు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నమంటూ కొట్టిపారేస్తున్నాయి విపక్షాలు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎసిసి యాజమాన్యంతో చర్చించి సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం ఇచ్చిన హామీ కూడా ఇంకా నెరవేరలేదు.

జమ్మలమడుగు-ముద్దనూరు మధ్య పెన్నానదిపై ఉన్న ఈ వంతెన.. 2021 నవంబర్‌లో వచ్చిన వరదలకు కుంగిపోయింది. వంతెనకు పక్కనే అప్రోచ్ రోడ్ వేసినా.. అది కూడా వరదలకు కొట్టుకుపోయింది. దీంతో చుట్టుపక్కల 16గ్రామాల ప్రజలునరకం చూస్తున్నారు. ఈ రొడ్డుమీద జమ్మలమడుగు రావాలంటేనే జంకుతున్నారు.

అభివృద్ధి లేకున్నా పథకాలు గెలిపిస్తాయా?

అభివృద్ధి అనుకున్న స్థాయిలో లేకపోయినా… ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ప్రజాభిమానం… వచ్చే ఎన్నికల్లో తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి. ప్రభుత్వంపై వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు.. అభివృద్ధిలో కనిపించని పురోగతి, స్థానిక ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకత తదితరకారణాలు…. తమ విజయానికి కలిసొస్తాయని విపక్షనేతలు భావిస్తున్నారు. చివరాఖరికి తేల్చేది ఓటర్లే కాబట్టి… రిజల్ట్‌ కోసం ఎన్నికలదాకా ఆగాల్సిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం