
ఆంధ్ర ఊటి అరకులో.. కొండలు, కోనలు, వాగులు.. అమాయక గిరిజన జీవనం.. వారి సాంస్కృతి, సాంప్రదాయాలు కట్టిపడేస్తాయి. మండే ఎండల్లో సైతం.. చల్లని చిరుగాలులతో ఆహ్లాదాన్ని పంచే అరకు లోయ.. ఇప్పుడు కూల్ క్లైమేట్ తో మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. శీతాకాలంలో అరకులోయ ప్రకృతి అందాలు మరింత పులకిస్తాయి. పసుపు చీర కట్టుకున్న పెళ్లికూతురుల అరకులోయ ముస్తాబవుతుంది. మంచు ముసుగులో కనువిందు చేస్తూ ఉంటాయి. వలిసె పూలు సోయగాలు.. ప్రకృతికి పసుపు చీర కట్టినట్టు వలస పూల పూదోటలు మనసును కట్టిబడేస్తూ ఉంటాయి. మంచి కురిసే వేళలో మల్లె వెరిసేది ఎందుకో అని ఓ సినీ కవి రాసినట్టుగా.. అరకులో మంచు కురుస్తున్న వేళ ఈ వలిసె పూలు విరిసి అందరినీ తమ వైపు ఆకర్షిస్తాయి. తనివి తీర చూసి ఆస్వాదించాలని ఆహ్వానిస్తాయి. ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్, జనవరి వరకు ఈ వలిసే పూల సోయగాలు కనిపిస్తూ ఉంటాయి. నవంబర్, డిసెంబర్ నెలలో ఈ పూల అందాలు మరింత వన్నె తెస్తాయి. పసుపు వర్ణంతో సింగారంలా ఆ లోయల అందాలను చెప్పతరం కాదు.
ఈ సీజన్లో వలిసె పూల అందాలను చూసేందుకు విశాఖ మన్యానికి పర్యాటకులు క్యూ కడుతుంటారు. విదేశాల్లో ఉన్నట్టు.. మనసు దోచే ఈ పూలు పిల్లగాలులకు అటూ ఇటూ ఊగుతూ స్వాగతం పలుకుతుంటాయి. ఈ పసుపు పూల అందాలను బంధించడానికి కెమెరాలు కూడా పోటీపడుతుంటాయి. అందుకే.. ఈ కాలంనే ఇక్కడ సినిమా షూటింగులు కూడా నిర్వహించేందుకు ఆసక్తి చూపుతుంటారు సినీ ఇండస్ట్రీ పెద్దలు..
చూసేందుకు అవి పొద్దుతిరుగుడు పూలుగా కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలోని ఇథియోపియా నుంచి వందల ఏళ్ల క్రితం ఇవి విశాఖ మన్యంలోకి ప్రవేశించాయని అంటున్నారు. ఇక్కడి అనుకూల వాతావరణంతో కొన్నేళ్ల క్రితం వరకూ ఎక్కడ చూసినా వీటి అందాలే కనువిందు చేశాయి. అరుకువ్యాలీ, పాడేరు ప్రాంతాల్లోనే 20 వేల ఎకరాల్లో ఈ వలిసె పూలు ఉండేవి. ఇప్పుడు 10 వేల ఎకరాల కంటే తక్కువకు సాగు పడిపోయింది. ఇంకా క్రమంగా తగ్గిపోతోంది. గిరిజన రైతులు గతంలో మాదిరిగా వలిసెల సాగుపై ఆసక్తి చూపించట్లేదు. రాజ్మా, పొద్దుతిరుగుడు లాంటి పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. వలిసె గింజల ధర స్థిరంగా లేకపోవడం, విత్తనాల సమస్య, సస్యరక్షణ ఖర్చు అధికమవ్వడం, గింజలతో నూనె తయారీకి ఖర్చు పెరిగిపోవడం లాంటి కారణాలు గిరిజన రైతులను వలిసెల సాగు నుంచి దూరం చేస్తున్నాయి. కొన్నేళ్లుగా వలిసె పైరును బంగారు తీగ అనే తెగులు పంటను దెబ్బతీస్తోంది. వలిసే పూల మకరందాన్ని ఆస్వాదించేందుకు వచ్చిన తేనెటీగలను ఆకర్షిస్తూ.. తోటల మధ్యన డబ్బాలు పెట్టి తేనె కూడా ఉత్పత్తి కూడా చేస్తారు.
ఏజెన్సీ ముఖద్వారం చిలకలగడ్డ ప్రాంతం నుంచి దారి పొడవునా వలిసె పూల అందాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీజన్లో పసుపు పచ్చటి వలిసే పూలతో ఒకపక్క పర్యాటకులను మైమరిపిస్తుంటే.. మరోపక్క వెండి మబ్బును తలపించే విధంగా ఉండే పాల సముద్రంలా ఉండే మంచు అందాలు.. మంచు ముసుగులో కొండలు పర్యాటకుల మదిని దోచుకుంటున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ పచ్చటి ప్రకృతి అందాలను చూసేందుకు మీరు సిద్ధమైపోండి మరి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..