APSRTC: ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?

సంక్రాంతితో ఏపీఎస్ఆర్టీసీ రికార్డుల పండుగ చేసుకుంది. పండగ వెళ్లిపోతూ ఆర్టీసీ ఖజానాకు కాసుల వర్షాన్ని మిగిల్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా, సంస్థ చరిత్రలోనే కనివినీ ఎరుగని రీతిలో జనవరి 19న ఒక్కరోజే భారీ దాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఆదాయంలోనే కాదు ఏకంగా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి సేవలోనూ సాటిలేదని నిరూపించుకుంది.

APSRTC: ఆర్టీసికి అసలైన పండగ తెచ్చిన సంక్రాంతి.. కలెక్షన్లలో అదిరే రికార్డు.. ఒక్కరోజే ఎన్ని కోట్లంటే..?
Apsrtc Shatters Records

Edited By:

Updated on: Jan 20, 2026 | 1:53 PM

సంక్రాంతి సీజన్‌ ఏపీఎస్ఆర్టీసీకి నిజమైన పండుగను తెచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలు గరిష్ఠ స్థాయికి చేరిన వేళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో ఒక్కరోజులోనే అత్యధిక ఆదాయం నమోదు చేసింది. ప్రయాణికుల అవసరాలను ముందుగానే అంచనా వేసి చేపట్టిన ప్రత్యేక చర్యలు ఈ ఫలితానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఇటీవల కాలంలో ప్రైవేట్ బస్సుల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడం, అదే సమయంలో ఛార్జీలను కూడా ప్రైవేట్ బస్సులు ఇష్టారాజ్యంగా పెంచేయడంతో చాలామంది ఈసారి ఆర్టీసీని ఆశ్రయించారు. సంక్రాంతి సందర్భంగాను పెంచని చార్జీలు ఒక వైపు, మరొక వైపు సురక్షితంగా గమ్యానికి చేరడానికి ఆర్టీసీనే సరైన మార్గమని రాష్ట్ర ప్రజలు భావించినట్టుగా అర్థం చేసుకోవచ్చు. దీంతో జనవరి 19న నమోదైన గణాంకాలు ఆర్టీసీ పనితీరుకు తాజా కొలమానంగా నిలుస్తున్నాయి.

ఒక్కరోజులో రికార్డు ఆదాయం

ఏపీఎస్‌ఆర్టీసీ జనవరి 19న ఒక్కరోజులోనే రూ.27.68 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇది సంస్థ చరిత్రలోనే సరికొత్త రికార్డు. ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఒకేరోజు ఈ స్థాయి ఆదాయం రావడం రికార్డుగా మారింది. సంక్రాంతి సెలవుల అనంతరం తిరుగు ప్రయాణాలు ఎక్కువగా ఉండటంతో బస్సుల ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. దూరప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాల వైపు ప్రయాణాలు అధికంగా నమోదయ్యాయి.

ప్రయాణికుల రవాణాలోనూ రికార్డు స్థాయి

ఆదాయంతో పాటు ప్రయాణికుల సంఖ్యలోనూ ఆర్టీసీ రికార్డు సాధించింది. ఒక్కరోజులోనే 50.6 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల నుంచి బస్సులు నిరంతరంగా నడవడం, అదనపు సర్వీసులు అందుబాటులో ఉంచడం వల్ల ప్రయాణికులకు పెద్దగా ఇబ్బందులు తలెత్తలేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే వారికి ఈ ఏర్పాట్లు ఎంతో ఉపశమనం కలిగించాయి.

ప్రత్యేక బస్సులతో సంక్రాంతి తిరుగు ప్రయాణం

సంక్రాంతి పండుగ తర్వాత తిరుగు ప్రయాణాల్లో రద్దీ ఉంటుందని ముందే అంచనా వేసిన ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ప్రధాన మార్గాలతో పాటు డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు సర్వీసులు నడిపింది. టిక్కెట్ కౌంటర్లు, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను సమన్వయంతో నిర్వహించడం వల్ల ప్రయాణికులు సులభంగా టిక్కెట్లు పొందగలిగారు.

సిబ్బందికి ఎండీ అభినందనలు

ఈ విజయానికి కారణమైన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అధికారులు అందరినీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రత్యేకంగా అభినందించారు. కష్టపడి పనిచేసిన ప్రతి ఉద్యోగి కృషి వల్లే ఈ రికార్డు సాధ్యమైందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తూ ఆర్టీసీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.