
ఏపీలో వాతావరణ అనిశ్చితి కొనసాగుతోంది. దీంతో రాబోయే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శనివారం విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, అనకాపల్లి, నంద్యాల, శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో జల్లులు లేదా ఓ మోస్తారు వానలు పడొచ్చని చెప్పింది.
ఇక శుక్రవారం నాడు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో 42, నంద్యాల జిల్లా గుల్లదుర్తిలో 41.7, తిరుపతి జిల్లా వెంకటగిరిలో 41.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరోవైపు శుక్రవారం నాడు పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు బలమైన గాలులు వీయడంతో కరెంట్ పోల్స్, చెట్లు నేలకూలాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..