JanaSena Party boycott the SEC meeting: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ (ఎస్ఈసీ) తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా శుక్రవారం జరిగే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఈ రోజు అన్ని రాజకీయ పార్టీలతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రత్రికా ప్రకటనను విడుదల చేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ సరైనది కాదని.. దీనిపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు జనసేన అధినేత పవన్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలు రావాలని ఆయన ఆహ్వానాన్ని పంపించారు. ఎస్ఈసీ.. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను పాత నోటిఫికేషన్ ప్రకారం కొనసాగిస్తామని, ఈ నెల 8న పోలింగ్, 10న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించడం అప్రజాస్వామిక చర్యగా జనసేన భావిస్తోందని తెలిపారు.
ఈ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని జనసేన హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు రాక ముందే ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరమన్నారు. అయితే ఈ తొందరపాటు నిర్ణయం అధికార పార్టీకి లబ్ధి చేకూరుస్తుందంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇదిలాఉంటే.. ఎస్‌ఈసీ సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ కూడా బహిష్కరిస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై ఆ పార్టీ నేతలు కూడా బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
కాగా.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని గురువారమే.. బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే నీలం సాహ్ని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కన్నబాబుతో సమీక్షించారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ హరిచందన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు. అనంతరం వెంటనే రాష్ట్రంలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేశారు. ఏపీలో ఈ నెల 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ను నిర్వహించనున్నారు. ఈ నెల 10న పరిషత్ ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్ని.. తీసుకున్న ఈ నిర్ణయంపై పలు పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు జరిగే అఖిలపక్ష సమావేశానికి ఏయే పార్టీలు హాజరవుతాయనేదీ వేచిచూడాల్సిందే.
Also Read: