Pinnelli: పోలీస్ కస్టడిలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి… కొనసాగుతున్న విచారణ..

| Edited By: Ram Naramaneni

Jul 08, 2024 | 2:35 PM

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు. ఈవీఎం ధ్వంసం, రెండు హత్యాయత్నం కేసుల్లో ఈనెల 8, 9 తేదీల్లో పోలీసులు పిన్నెల్లిని విచారించేందుకు కోర్టు అనుమతించింది. విచారించేటప్పడు వీడియో తీయాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

Pinnelli: పోలీస్ కస్టడిలో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి... కొనసాగుతున్న విచారణ..
Pinnelli Ramakrishna Reddy
Follow us on

సార్వత్రిక ఎన్నికల సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. దీనిపై అటు భారత ఎన్నికల సంఘం, ఇటు కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపధ్యంలోనే దాడులకు పాల్పడిన వారిని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవిఎం ధ్వంసంతో పాటు రెండు హత్యాయత్నం కేసులను పోలీసులు నమోదు చేశారు. రెండు హత్యాయత్నం కేసుల్లో పిన్నెల్లికి మాచర్ల కోర్డు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన జిల్లా జైల్లో ఉన్నారు. అయితే పిన్నెల్లిని కస్టడికి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును ఆశ్రయించగా రెండు రోజుల పాటు కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది.

రెండు హత్యాయత్నం కేసుల్లో రెండు రోజుల పాటు పోలీస్ కస్టడికి అనుమతించిన కోర్టు జిల్లా జైల్లోనే విచారించాలని ఆదేశించింది. విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ చేయాలని సూచించింది. ఈ నెల 8, 9 తేదిల్లో విచారణ కొనసాగుతోంది. ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసులు పిన్నెల్లిని విచారించనున్నారు. మధ్యాహ్నం గంటపాటు లంచ్ బ్రేక్ ఇచ్చారు.

గురజాల డిఎస్పీ చుండూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలోని పోలీసుల బృందం పిన్నెల్లిని విచారిస్తుంది. కారంపూడి సిఐ నారాయణ స్వామిపై దాడి వెనుక ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆయుధాలతో కారంపూడిలో దాడి చేయాల్సి వచ్చిందంటూ పోలీసులు పిన్నెల్లిని ప్రశ్నిస్తున్నారు. దాడి సమయంలో పెట్రోల్ పోసి టిడిపి కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు వాహనాలపై కూడా పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఈ అంశాలపై కూడా ఆయనకు ప్రశ్నలు సంధించబోతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈవిఎం ధ్వంసం వెనుక ఉద్దేశం ఏంటి, ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఎందుకు ఈవిఎంను ధ్వంసం చేశారు అని ప్రశ్నలు అడిగినట్లు సమాచారం… ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు పోలీసులు పిన్నెల్లి విచారించి సమాధానాలు రాబట్టనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..