
సంక్రాంతి పండగ అంటే గోదావరి జిల్లాల్లో కోడిపందాలు, రికార్డింగ్ డాన్సులు జరగడం ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే..! అయితే ఈ కార్యక్రమాల్లో చోటుచేసుకున్న కొన్ని ఘటనలు అప్పుడప్పుడూ వివాదాలకు దారి తీస్తుంటాయి. తాజాగా డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో జరిగిన ఒక రికార్డ్ డాన్స్ కార్యక్రమం తీవ్ర చర్చకు దారి తీసింది. మహిళా డ్యాన్సర్లతో స్థానిక నేత ప్రవర్తించిన తీరు, ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరాలకు కారణమయ్యాయి. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించడంతో విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజోలు నియోజకవర్గం గోగన్న మఠం గ్రామంలో ఇటీవల అనధికారికంగా ఏర్పాటు చేసిన రికార్డ్ డాన్స్ కార్యక్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా డ్యాన్సర్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అసభ్యకరమైన నృత్యాలు చేయాలంటూ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. మహిళల గౌరవాన్ని బహిరంగంగా అవమానించేలా జరిగిన ఈ వ్యవహారాన్ని కమిషన్ తీవ్రంగా ఖండించింది.
ఈ ఘటనను మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడం, వారి వీడియోలను రికార్డ్ చేయడం, నృత్యానికి బలవంతం చేయడం మహిళల గౌరవం, స్వేచ్ఛ, భద్రతపై ప్రత్యక్ష దాడిగా కమిషన్ అభిప్రాయపడింది. ఇలాంటి ప్రవర్తన సమాజంలో మహిళల పట్ల ఉన్న దురభిప్రాయాలను బయటపెడుతోందని పేర్కొంది. ఈ వ్యవహారానికి సంబంధించి నిందితుడైన స్థానిక నాయకుడికి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కమిషన్ ముందు హాజరై సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలు, సాక్ష్యాలు సమర్పించాలని పోలీసులను కూడా కమిషన్ కోరింది.
ఈ ఘటనపై ఇప్పటికే నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ స్పష్టం చేసింది. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా సహించబోమని, మహిళల భద్రత, గౌరవ పరిరక్షణే తమ ప్రధాన లక్ష్యమని కమిషన్ మరోసారి స్పష్టం చేసింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..