Stamps and registrations scam: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్‌లో జరిగిన అక్రమాలు ఇప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగాన్ని కుదిపేస్తున్నాయి. ఈ అంశం మీద కొంచెం సేపటి క్రితం టీవీ9 తో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజి శేషగిరి బాబు మాట్లాడారు. పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. చలానా మార్ఫింగ్ అక్రమాలకు సంబంధించి మొత్తం 5.5 కోట్ల రూపాయలు తేడా వచ్చినట్టు గుర్తించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 17 ప్రాంతాల్లో ఇలాంటి అవకతవకలు జరిగినట్టు తెలుస్తుందన్నారాయన.
ఈ తరహా అక్రమాలు అత్యధికంగా 10 చోట్ల భారీ అవకతవకలు జరిగాయని ఐజి శేషగిరి బాబు చెప్పారు. “కృష్ణా, కడప జిల్లాల్లో భారీ స్థాయిలో అక్రమాలు చోటు చేరుకున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో ఆర్గనైజ్డ్ గా చేశారు. ముందు కడపలో ఈ వ్యవహారాన్ని గుర్తించాం. సీఎఫ్ఎంఎస్ తో తేడా కనపడిన చోట మా అధికారులను పంపించాము. అన్ని చోట్లా క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నాం. ఇందులో అనధికార వ్యక్తులు ఉన్నా చర్యలు తీసుకుంటాం. కోటికి పైగా రిజిస్ట్రేషన్ లు ఇప్పటికే వేరిఫై చేశాం.” అని ఐజి పేర్కొన్నారు.
అంతేకాదు, ఇప్పటికే ఇలా జరిగిన రిజిస్ట్రేషన్స్ రద్దు చేయొచ్చా లేదా అన్నది కూడా మేము న్యాయ పరిశీలన చేస్తామని ఐజీ తెలిపారు. “ఇప్పటికే కోటి రూపాయల వరకు మేము రికవరీ చేశాం. సాఫ్ట్ వేర్‌లో చేంజస్ ఇప్పటికే చేశాం.. ఇది బయటపడే నాటికే మేము ఆ చర్యలు తీసుకున్నాం. మరో 15 రోజుల్లో ఈ విచారణ పూర్తి చేస్తాం.. ఇప్పటికే పలువురిని సస్పెండ్ చేశాం” అని ఐజి చెప్పుకొచ్చారు.