ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కొనసాగుతోంది. నిత్యం రాష్ట్రంలో భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా…మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ భయంతో ఏపీ సచివాలయం ఉద్యోగులు వణికిపోతున్నారు. గడిచిన మూడు రోజుల్లో నలుగురు ఉద్యోగులు మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. హోమ్ శాఖలో డిఆర్&టి అసిస్టెంట్ ఏ ఎస్ ఎన్ మూర్తి కరోనాతో సోమవారం మృతి చెందారు. పంచాయతీ రాజ్ శాఖలో సెక్షన్ ఆఫీసర్ గా పని చేస్తున్న శాంత కుమారి కూడా ఈ రోజు ఉదయం మృతి చెందారు. రెండు రోజుల క్రితం శాంత కుమారి భర్త సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీ గా పని చేస్తున్న వి.పద్మా రావు కూడా కరోనాతో మృతి చెందారు. మరికొందరు కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు సచివాలయంలోని వివిధ సెక్షన్స్ లో పనిచేస్తున్న పనిచేసే దాదాపు 100 మందికి పైగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లో సచివాలయానికి వచ్చి పనిచేయలేమని ఉద్యోగులు చెబుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వన్ని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఒకట్రెండు రోజుల్లోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
ఉద్యోగుల చరిత్రలో దురదృష్టకరమైన రోజు…అశోక్ బాబు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల చరిత్రలో నేటిరోజు అత్యంత దురదృష్టకరమైనదని..సచివాలయంలో నలుగురు కరోనాతో మరణించడం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ప్రభుత్వం పట్టుదలకు పోకుండా ఉద్యోగులకు ఇంటినుంచి పనిచేసే అవకాశంకల్పించాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్ పంపిణీలో ఫ్రంట్ లైన్ వారియర్స్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు ప్రజలకు చేర్చడంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న అన్నిశాఖల ఉద్యోగులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన్నారు. పీపీఈ కిట్లను ప్రభుత్వ ఉద్యోగులకు అందించాలని కోరారు. మరణించిన ఫ్రంట్ లైన్ వారియర్ల కుటుంబాలకు వర్తించే ప్రయోజనాలను ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అలసత్వం వివిధశాఖల ఉద్యోగులకు ప్రాణాంతకంగా మారకూడదని అశోక్ బాబు పేర్కొన్నారు.