AP SEC Review on Local Body Election: ఆంధ్రప్రదేశ్ ఎల్లుండి జరిగే స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఎస్ఈసీ అధికారులు.. అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విల్లూరుతుండగా, సత్తా చాటుకునేందుకు టీడీపీ సిద్ధమైంది.. ఎన్నికల ప్రచారంలో మాటల యద్ధం ముగిసింది. ఇక ఓటరు తీర్పు కోసం ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటించని వారిని పోలింగ్ కేంద్రాల్లోని అనుమతి వద్దని ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, ఓటర్లను మాస్కు లేకుండా పోలింగ్ స్టేషన్‌లో ఓటు వెయ్యడానికి అనుమతించద్దని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఆదివారం జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులతో ఆమె మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కారణాలతో మిగిలిపోయిన గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు నిర్వహిస్తున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన కోవిడ్ నిబంధనలపై అధికారులకు నీలం సాహ్ని మార్గదర్శకాలు జారీ చేశారు. ఎన్నికల నిర్వహణలో అధికారులు గుమిగూడకూడదన్నారు. కౌంటింగ్ సమయంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. పోలింగ్‌కు ఒకరోజు ముందే పోలింగ్ స్టేషన్‌ను సానిటైజ్ చెయ్యాలని సిబ్బందికి సూచించారు. అలాగే ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి ఒకరు మాస్కు, సానిటైజరు ఉపయోగించాలన్నారు. కేంద్ర హోం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ 19 నిబంధనలను పాటించాలన్నారు. పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ నిర్వహించే అధికారుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ పోలింగ్ నిర్వహించాలని ఆమె ఆదేశించారు.