AP Rains: రెయిన్ అలెర్ట్.. ఏపీలో ఈ నెల 4 వరకు వర్షాలే వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలకు..

ఈశాన్య రుతుపవనాలు మరింతగా చురుగ్గా కడులుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

AP Rains: రెయిన్ అలెర్ట్.. ఏపీలో ఈ నెల 4 వరకు వర్షాలే వర్షాలు.. ముఖ్యంగా ఆ జిల్లాలకు..
Andhra Weather Report

Updated on: Nov 02, 2022 | 7:11 PM

కోస్తా తమిళనాడు, పొరుగు ప్రాంతలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఆయా ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఈశాన్య రుతుపవనాలు మరింతగా చురుగ్గా కడులుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమంతటా ఈ నెల 4వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాల యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు చేపడుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత చోట్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, గుంటూరు, బాపట్ల ప్రకాశం, నంద్యాల, వైఎస్సార్ కడప , అన్నమయ్య జిల్లాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతం యానాంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఇక అల్లూరి సీతారామరాజు, విజయవాడ, ఈస్ట్ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, కర్నూల్, అనంతపూర్, శ్రీసత్యసాయి, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశముందని చెప్పింది. కాగా, చెన్నై, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు సూచించారు. మత్స్యకారులు మరో రెండు రోజులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.