తుని, నవంబర్ 7: తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలుకి తృటిలో ప్రమాదం తప్పింది. ఓ సంచీలో ఉన్న బాణసంచా అంటుకొని పేలి పొగలు రావడం కలకలం రేపింది. వెంటనే ప్రయాణికులు స్పందించి సంచిని బయటికి విసిరేయడంతో ప్రమాదం తప్పింది. లేదంటే ఊహించని ప్రమాదం చోటుచేసుకునేది. విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్పీఎఫ్, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం నుంచి బయల్దేరిన తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో తుని స్టేషన్‌లో ఆగింది. తిరిగి రైలు బయలుదేరుతున్న సమయంలో ఎస్ 3 బోగీలోని మరుగుదొడ్డి వద్ద ఉన్న సంచిలో నుంచి పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే రైలు చైనులాగి దిగేందుకు ప్రయత్నించారు. వెంటనే బాణసంచా పేలకుండా ప్రయాణికులు కాళ్లతో తొక్కి ఆ సంచీని బయటకు విసిరేశారు. అప్పటికీ బోగీ నిండా పొగ వ్యాపించింది. ప్రయాణికులు సకాలంలో కాళ్లతో తొక్కి మంటలను అదుపు చేశారు.
దీనిపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, రైల్వే సిబ్బంది బోగీని పరిశీలించారు. కొద్ది సమయం అనంతరం రైలు బయల్దేరింది. ట్రాక్ పక్కన పడి ఉన్న బాణసంచా జీఆర్పీ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా జీఆర్పీ సిబ్బంది మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు సంచిలో బాణ సంచా ఉంచి ట్రైన్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. బాణసంచా ఉన్న సంచిలో స్వల్ప పేలుడు సంభవించి పొగలు వ్యాపించినట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లా కుప్పంలో పిచ్చికుక్క దాడిలో 14 మంది చిన్నారులకు గాయాలయ్యాయి. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకోగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ కాలనీ, దళవాయికొత్తపల్లె, కొత్తపేట, రాజీవ్ కాలనీలో ఓ పిచ్చి కుక్క తిరుగుతోంది. అది ఆరు బయట ఆడుకుంటున్న చిన్నారులపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచింది. బాధిత చిన్నారులందరినీ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో కొందరు ఇళ్లకు వెళ్లిపోగా.. ఇషాంత్(8), యశశ్విని(9), ఫైజ్(2), అమ్ములు(11), కౌశిక్(8), కౌనేష్(7)లు ఆస్పత్రిలో చేర్పించారు. వీధుల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రాత్రిళ్లు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంద తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.