ఏపీలో పల్లె పోరుకు సర్వం సిద్ధం.. రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. భారీ భద్రతా ఏర్పాట్లు!

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5, గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఏపీలో పల్లె పోరుకు సర్వం సిద్ధం.. రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. భారీ భద్రతా ఏర్పాట్లు!
Ap Mptc Zptc Elections 2026

Updated on: Nov 04, 2026 | 4:02 PM

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5, గురువారం జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల పరిధిలో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. మొత్తం 582 జెడ్పీటీసీ స్థానాలు, 7,767 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవం కావడంతో మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎన్నికల బరిలో వేలాది మంది అభ్యర్థులు

ఈ ఎన్నికల్లో 77 జెడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం కాగా, 2,051 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 2,169 మంది జెడ్పీటీసీ అభ్యర్థులు, 18,843 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.

2.61 కోట్ల మంది ఓటర్లు.. మహిళలే అధికం!

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.28 కోట్ల మంది పురుషులు, 1.32 కోట్ల మంది మహిళలు కాగా, 1,282 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 8,904 సమస్యాత్మక, 7,160 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. మొత్తం 16,064 కేంద్రాల్లో సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. మరో 6 వేల కేంద్రాల్లో ల్యాప్‌టాప్‌ల ద్వారా వెబ్‌కాస్టింగ్, 6,507 కేంద్రాల్లో వీడియోగ్రఫీ నిర్వహించనున్నారు. పోలింగ్ విధుల కోసం 36,684 మంది ప్రిసైడింగ్ అధికారులను నియమించారు. శాంతిభద్రతల పరిరక్షణకు 40,679 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

రవాణా, కౌంటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు

ఎన్నికల సిబ్బంది, సామగ్రి తరలింపు కోసం 4,442 భారీ వాహనాలు, 3,200 చిన్న వాహనాలను సిద్ధం చేశారు. పోలింగ్ కోసం 1,01,618 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 365 కేంద్రాలు, 9,062 కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశారు.

మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేందుకు ఓటర్లు సిద్ధమవుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us