Andhra Pradesh: ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల కీలక భేటీ..

ఏపీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆక్వా, పొగాకు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా ఏపీ మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి, కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలుసుకుంది. రాష్ట్రంలోని ఆక్వా రంగానికి విధానపరమైన మద్దతు ఇవ్వాలని, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

Andhra Pradesh: ఆక్వా, పొగాకు రైతుల కష్టాలు తీరేనా.. కేంద్రమంత్రులతో ఏపీ మంత్రుల కీలక భేటీ..
Ap Ministers Meet Central Ministers In Delhi

Edited By:

Updated on: Jul 20, 2026 | 9:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా, పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేసింది. మంత్రులు రవికుమార్, డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు, రైతులు ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులను వేర్వేరుగా కలిసి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌ను కలిసి రాష్ట్ర ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన జీఎం సోయాబీన్ మీల్ దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రొయ్యల మేత తయారీ వ్యయం తగ్గి ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుందని వివరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు విధానపరమైన మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు.

జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు

గతంలో కేంద్రం ప్రకటించినట్లుగా అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటును వేగవంతం చేయాలని కోరారు. కార్యాలయం కోసం కేటాయించిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులు ప్రారంభించాలని, 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో అమరావతి బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు.

పొగాకు రైతుల సమస్యలపై పీయూష్ గోయల్ తో భేటి

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను కలిసి ఏపీ నుంచి ఎఫ్‌సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లలో రాష్ట్ర పొగాకు రైతులకు మరింత అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పొగాకు ధరలు, మార్కెట్ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రైతులకు గిట్టుబాటు కల్పించేలా పొగాకుకు కనీస మద్దతు ధర అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంపై జీఎస్టీ తగ్గింపు అంశాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రాష్ట్ర మంత్రులు వెల్లడించారు. ఈ సమావేశం తో రాష్ట్ర రైతులు, ఆక్వా ,రంగ ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Follow Us