Pawan Kalyan vs AP Ministers: యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా.. పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రుల ముప్పేట దాడి..

యువత చేత రౌడీయిజం చేయిస్తున్నారా అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు ఏపీ మంత్రులు. ఎవరి డైరెక్షన్‌లో పవన్‌ పని చేస్తున్నారో నిన్న అందరికి అర్థమైపోయిందంటూ ఎద్దేవా చేశారు . యువతకు బూతులు నేర్పించదలుచుకున్నారా అంటూ పవన్‌ను ప్రశ్నించారు ఏపీ మంత్రులు.

Pawan Kalyan vs AP Ministers: యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా.. పవన్ కల్యాణ్‌పై ఏపీ మంత్రుల ముప్పేట దాడి..
Ap Political News

Updated on: Oct 19, 2022 | 4:35 PM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు దాడి మొదలుపెట్టారు. తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ విశాఖ పర్యటనతో మొదలైన రగడ చిలికి చిలికి రాజకీయ రచ్చగా మారుతోంది. వైసీపీ ప్రభుత్వం పై, వైసిపి మంత్రులపై గతంలో ఎన్నడూ లేని విధంగా పవన్ కల్యాణ్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ మంత్రులు ఒకరి తర్వాత ఒకరు మాటల దాడిని మొదలు పెట్టారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శలు గుప్పించారు. జనసేన కార్యకర్తలపై కామెంట్ చేసిన మంత్రి కారుమూరి ఇప్పుడు పవన్‌‌ కల్యాణ్‌కు సూటి ప్రశ్నలు సంధించారు.

ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పవన్ కల్యాణ్‌ పై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్ కాల్ షీట్ ముగిసిపోయిందని.. అందుకే పవన్ కల్యాణ్‌ మళ్లీ హైదరాబాద్ వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. తంతా కొడతా అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్న పవన్ కల్యాణ్ జన సైనికులకు ఏం సందేశం ఇస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. విశాఖ గర్జనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని పేర్కొన్న ఆయన.. జనసైనికులు విశాఖ ఎయిర్ పోర్ట్‌లో దాడి చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

యువతను రెచ్చగొట్టి రౌడీయిజం చేస్తావా..?

జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడితే, మంత్రి రోజా వెంట్రుకవాసిలో దాడి నుంచి తప్పించుకున్నారని మంత్రి కారుమూరి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ యువతకు రౌడీయిజం నేర్పిస్తున్నారా అని ప్రశ్నించిన మంత్రి కారుమూరి, యువతకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి.. దాడులు చేయమని రెచ్చగొడతారా అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నోటికొచ్చింది మాట్లాడితే తాట తీస్తా అని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన ఆయన ఇప్పటి వరకు ఎంత మంది తాట తీశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆయన డైరెక్షన్‌లోనే పవన్ కల్యాణ్..

టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే రాష్ట్ర ప్రజలపై దాడి చేసే స్థాయికి పవన్ కళ్యాణ్ దిగజార్చారని విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ స్టార్, చంద్రబాబు దత్తపుత్రుడు అన్న మాటలను ముమ్మాటికీ నిజం చేసుకుంటున్నారని మంత్రి కారుమూరి ఎద్దేవ చేశారు. ఇప్పటివరకు ఉన్న పవన్ కళ్యాణ్ ముసుగు తొలిగిపోయిందని.. పవన్ కల్యాణ్ నిజ స్వరూపం ఇదే అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు.

ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్ చెప్పాలి..?- మంత్రి సీదిరి అప్పలరాజు

ఇక మరో రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మరిన్ని విమర్శలు గుప్పించారు. మీ తల్లిని తిట్టించిన టీడీపీ, ఎల్లో మీడియా తిట్లు నేడు ఆశీర్వచనాలయ్యాయా పవన్..? అంటూ ప్రశ్నించారు. విడిపోయిన బాబుతో మళ్ళీ కలవటానికి ఎంత ప్యాకేజీ ముట్టిందో పవన్ చెప్పాలి..? అంటూ ఎద్దేవ చేశారు. ప్యాకేజీ కల్యాణే కాకపోతే.. 175 స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ లు నోవాటెల్ హోటల్ లో కలిసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ మీడియా ముందుకు వచ్చారని.. విశాఖలో గర్జనకు మద్దతుగా వచ్చిన మంత్రులపై దాడి చేసిన వారిని, దాడికి ప్రోత్సహించినవారికి మద్దతు తెలిపిన వారిని పరామర్శించడం ఎక్కడైనా ఉంటుందా.. అంటూ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు మద్దతు తెలిపేందుకు వచ్చిన మంత్రులపై దాడులు చేయించావు అంటే.. ఇది ఉత్తరాంధ్రకు మీరు చేస్తున్న ద్రోహం కాదా..? అంటే ఉత్తరాంధ్రకు ఎవరూ మద్దతు పలక కూడదా.. పలికితే దాడులు చేయిస్తారా..? అంటూ విమర్శించారు.

విశాఖ రాజధాని కావాలని మేం గర్జించడం దౌర్జన్యమా.. లేక మీరు మంత్రులపై దాడులు చేయడం దౌర్జన్యమా..? దాడి చేసిన వారిని పరామర్శించడం దౌర్జన్యమా.. లేక దాడికి గురైన వారిని పరామర్శించకపోవడం దౌర్జన్యమా..? చంద్రబాబులో ఏం నచ్చి, మళ్ళీ చంద్రబాబుతో కలిశారో పవన్ కల్యాణ్ చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.

“ఎవరి రాజధాని అమరావతి” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నీవే..

మూడు రాజధానులు అనేది.. విప్లవాత్మకమైన నిర్ణయం. రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించాలని, అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని ముఖ్యమంత్రి జగన్ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. గతంలో హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి అంతా ఏకీకృతమైతే.. ఏం జరిగిందో మనం చూశాం. అదే బాటలో అమరావతిలోనే సంపదనంతా పోస్తే.. మరి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మరింత వెనక్కి వెళ్ళాల్సిందేనా..

గతంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు రాసిన.. “ఎవరి రాజధాని అమరావతి” అనే పుస్తకాన్ని ఆవిష్కరించిన నీవే, “ఏకీకృత అభివృద్ధి కరెక్టు కాదు” అని మాట్లాడిన నువ్వే.. ఈరోజు మళ్ళీ అమరావతి పాట పాడుతున్నావంటే.. ప్యాకేజీ తీసుకోలేదంటే నిన్ను ఎవరు నమ్ముతారు.? నీవు ప్యాకేజీ కోసం, ప్యాకేజీతోనే రాజకీయాలు చేస్తావని నీవే స్పష్టమైన సంకేతాలు ఇచ్చావు. అమరావతి మీద నీ విధానం నిన్నొకలా.. ఈరోజు ఒకలా ఎందుకు ఉంది. 2018-19లో ఒకలా.. 2019 తర్వాత నీ విధానం ఎలా మారింది, ఎందుకు మారిందో చెప్పాలని మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం