AP News: సెలైన్ ఇంజెక్షన్‌తో అసెంబ్లీకి మంత్రి నిమ్మల.. సభలో ఆసక్తికర చర్చ

| Edited By: Janardhan Veluru

Mar 07, 2025 | 7:32 PM

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (AP Minister Nimmala Rama Naidu) జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతూనూ అసెంబ్లీకి హాజరయ్యారు. ఆయన కర్తవ్య నిబద్ధతను సభ్యులు ప్రశంసించారు. నారా లోకేష్ విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రామానాయుడు గతంలోనూ అలాంటి సేవాభావాన్ని చూపించారని గుర్తు చేశారు. ప్రజా సేవకు ఆయన కట్టుబాటును అందరూ కొనియాడారు. నిమ్మల ఆరోగ్యంపై ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది.

AP News: సెలైన్ ఇంజెక్షన్‌తో అసెంబ్లీకి మంత్రి నిమ్మల.. సభలో ఆసక్తికర చర్చ
Ap Minister Nimmala Rama Naidu
Follow us on

ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ, తన బాధ్యతలను నిర్లక్ష్యం చేయకుండా అసెంబ్లీకి హాజరయ్యారు. గత నాలుగు రోజులుగా నిమ్మల జ్వరం, డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారు. చేతికి డ్రిప్ లైన్‌తోనే అసెంబ్లీలో హాజరుకావడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనపై సభలో ఆసక్తికర చర్చ జరిగింది. అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. రామానాయుడు రెండు రోజుల విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ, ఆయన విధుల పట్ల ఉన్న చిత్తశుద్ధి కారణంగా అసెంబ్లీకి హాజరయ్యారని పేర్కొన్నారు. అలాగే, రామానాయుడు విశ్రాంతి తీసుకునేలా రూలింగ్ ఇవ్వాలని డిప్యూటీ స్పీకర్‌ రఘురామ కృష్ణంరాజును కోరారు. మరో ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కూడా రామానాయుడు పని రాక్షసుడని అభివర్ణిస్తూ, ఆయన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణ రాజు కూడా రామానాయుడు ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.

మంత్రి నిమ్మల అనారోగ్యంపై సభలో చర్చ

అసెంబ్లీ లాబీలో నారా లోకేష్ – రామానాయుడు మధ్య సంభాషణ

అటు అసెంబ్లీ లాబీలో మంత్రి నిమ్మల రామానాయుడు, మంత్రి నారా లోకేష్ ఎదురుపడ్డారు. రామానాయుడు ఆరోగ్యాన్ని గురించి లోకేష్ ఆరా తీశారు. “అన్నా, ఆరోగ్యం జాగ్రత్త,” అంటూ లోకేష్ సలహా ఇచ్చారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. మీరు ఇలాగే సభకు వస్తే, సభ నుండి సస్పెండ్ చేసి పంపాలా? అంటూ నవ్వుతూ అన్నారు. మీరు రెస్ట్ తీసుకోకపోతే, మీకు యాపిల్ వాచ్ కొనిచ్చి, మీ స్లీపింగ్ టైమ్ ట్రాక్ చేయాలా? అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

మంత్రి నిమ్మల ఆరోగ్యంపై ఆరాతీసిన నారా లోకేశ్

రామానాయుడు సేవా భావంపై ప్రశంసలు

ఇది కొత్త కాదు. గతంలో విజయవాడ వరదల సమయంలోనూ రామానాయుడు బుడమేరు గండి పూడ్చేందుకు పలు రాత్రులు అక్కడే గడిపారు. ప్రజలకు ఉపయోగపడే ఏదైనా పనిలో ఉంటే, అది పూర్తయ్యే వరకు అహర్నిశలు శ్రమిస్తారని సీఎం చంద్రబాబు కూడా పలుమార్లు ప్రశంసించారు. మొత్తానికి, అనారోగ్యంతో ఉన్నప్పటికీ, ప్రజా సేవ కోసం అసెంబ్లీకి హాజరైన నిమ్మల రామానాయుడు తన కర్తవ్య నిబద్ధతను మరోసారి రుజువు చేసుకున్నారు.