
సాధారణంగా తండ్రిని మించిన తనయుడు అనే సామెత వింటుంటాం.. కానీ ఆ చిచ్చర పిడుగు మాత్రం తాతను మించిన మనవడు అయ్యాడు. తన తాత పీజీ స్టాటిస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే, ఆయన మనవడు ఏకంగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి తాతను మించిన మనవడు అనిపించుకున్నాడు. ఇంతకీ గోల్డ్ మెడల్ సాధించిన ఆ తాత ఎవరు? గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆ మనవడు ఎవరు..? తెలుసుకుందాం.
పొంగురు నారాయణ.. నారాయణ విద్యాసంస్థల అధిపతిగా ఏపీ మంత్రిగా అందరికి సుపరిచితమే. అయితే ఆయన నాడు పీజీ స్టాటిస్టిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధిస్తే, ఆయన మనవడు గంటా జిష్ణు ఆర్యన్ కేవలం 8 ఏళ్ల పసిప్రాయంలోనే గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాడు. ఔరా అనిపించుకున్నాడు..! నారాయణ కూతురు షరణి – గంటా రవితేజల కుమారుడు గంటా జిష్ణు ఆర్యన్ రికార్డ్ ఫీట్ సాధించి ఔరా అనిపించాడు. గోల్డెన్ రేషియోగా పిలువబడే ఫై అనే సంఖ్యలో ఉన్న 216 దశాంశ స్థానాలను 60 సెకన్లలో చెప్పి గిన్నిస్ రికార్డుల్లోకెక్కాడు జిష్ణు ఆర్యన్.
గోల్డెన్ రేషియోపై సాధారణంగా గుర్తుంచుకోవడం కష్టం. నాలుగైదు దశాంశ స్థానాలను సరిగ్గా గుర్తు చేసుకోవడానికే కష్టపడాలి. అలాంటిది అందులోని 216 దశాంశ స్థానాలను గుర్తుంచుకోవడం, అది కూడా కేవలం నిమిషం వ్యవధిలోనే చెప్పగలగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. కానీ ఆ ఘనత సాధించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కాడు గంటా జిష్ణు ఆర్యన్. హైదరాబాద్ లో గిన్నిస్ బుక్ అధికారుల పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో జిష్ణు తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ కుటుంబ సభ్యులు జిష్ణుకి శుభాకాంక్షలు తెలిపారు. నారాయణ గ్రూప్ డైరెక్టర్ షరణి, తన తనయుడు జిష్ణు ప్రతిభను చూసి ముగ్ధురాలయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..