Kodali Nani fire on Chandrababu: ఏపీలో ఉన్న వైరస్ ఏది? ఎందుకు ఊహించని స్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. దీనిపై విభిన్న వాదనలు ఉన్నాయి. ఢిల్లీ, ఒడిశాలాంటి రాష్ట్రాలు.. ఏపీ ప్రజలను తమ దగ్గరకు రావొద్దు అంటూ ఆంక్షలు పెట్టాయి. దీనికి కారణం n440K అని చంద్రబాబు అంటే.. కాదు.. అంతకుమించిన ప్రమాదకరమైన వైరస్ ను కనుగొన్నామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వేరియంట్ పై రాజకీయ వైరం కొనసాగుతోంది. n440K వైరస్ పై అధికార, విపక్షాల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. కర్నూలులో వైరస్ పుట్టిందని.. అత్యంత ప్రమాదకరమని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు కాగా.. కర్నూలు పోలీసులు చర్యలకు సిద్దమవుతున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా ఎవరు ప్రచారం చేసినా చట్టపరంగా చర్యలు తప్పవన్న ఎస్పీ ఫకీరప్పీ.. టీడీపీ అధినేతపై నమోదైన కేసులో వన్‌టౌన్ ఎస్‌ఐను విచారణ అధికారిగా నియమించినట్టు తెలిపారు.
కరోనా వేరియంట్ ఎన్ 440 కర్నూలు జిల్లాలోనే పుట్టిందంటూ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ పై మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వందేళ్ల చరిత్రలో ఇటువంటి కరోనా వైరస్ మానవ జాతి మీద దాడి చేసిన దాఖలాలు లేవు. దీనిని ఎదుర్కోవడానికి, ప్రజల్ని కాపాడుకోవటానికి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుంటే.. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. అసత్య ప్రచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు, రూ.1600 కోట్లు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ వేయటానికి ముఖ్యమంత్రి ఎందుకు వెనకాడుతున్నాడని చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ లు పెట్టి విమర్శిస్తే.. ఆయన అనుకూల మీడియాలో ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురి చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. మొదటి విడత కరోనాలో పేద, మధ్యతరగతి వారి వైద్యం కోసం రూ. 1900 కోట్లు ఆరోగ్య శ్రీ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసిందని.. వ్యాక్సిన్ ల కోసం రూ. 1600 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
కేవలం 24 గంటల్లో 6 లక్షల వ్యాక్సిన్ లు పూర్తి చేసిన ఘనత దేశంలో మరే రాష్ట్రంలో అయినా ఉందా..? అని కొడాలి నాని ప్రశ్నించారు. భారత్ బయోటెక్‌ను అడిగి రాష్ట్ర ప్రజలందరికీ వెంటనే వేసేందుకు కావాల్సినన్ని టీకాలు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేస్తే 10 రోజుల్లోనే రాష్ట్ర ప్రజలందరికీ టీకాలు వేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదిని కొడాలి నాని స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన కుమారుడు, కుటుంబ సభ్యులు సింగపూర్ నుంచి దొడ్డిదారిన తెప్పించుకుని వ్యాక్సిన్లు వేసుకున్నట్టు.. దొంగతనంగా వ్యాక్సిన్లు అమ్మే కంపెనీలు ఏమైనా ఉన్నాయో వారే చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
అయితే కరోనాపై ఎవరు అవగాహప కల్పించినా.. ప్రజలను అప్రమత్తం చేసిన కేసులు పెట్టొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందని.. దీనిపై ముందుకు వెళితే డీజీపీ కోర్టుకు సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు టీడీపీ నేత పట్టాబి. కేవలం కరోనా నియంత్రణలో వైఫల్యం చెందిన ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుందన్నారు. జాతీయ అంతర్జాతీయ పత్రికలతో పాటు.. శాస్త్రవేత్తలు చెప్పిన అంశాలనే చంద్రబాబు చెబితే కేసులు ఎలా పెట్టారని ప్రశ్నించారు. అటు వైసీపీ చంద్రబాబుపై విమర్శలు వర్షం కొనసాగిస్తోంది. రాష్ట్రంలోని కర్నూలులో వైరస్ పుట్టలేదని.. చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో అసలు NCB420 వైరస్ 70 ఏళ్ల క్రితం పుట్టి రాష్ట్రాన్ని నాశనం చేస్తుందన్నారు మంత్రి కొడాలి నాని. కరోనా సమయంలో ఎవరు జనాలను భయపెట్టేలా మాట్లాడిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని సూచించారు మంత్రి కొడాలి.
ఓవైపు కరోనా రాష్ట్రాన్ని వణికిస్తుంటే.. మరోవైపు వైరస్ వేదికగా రాజకీయ విమర్శలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు చేసిన ఎన్ 440 వేరియంట్ కామెంట్స్ పొలిటికల్ హీట్ ను పెంచాయి. మరి ఈ వైరస్ వార్ పాలిటిక్స్ ను ఎంతవరకు తీసుకెళ్తుందో వేచి చూడాలి.
Read Also… ఏపీలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. కొత్తగా పాజిటివ్ కేసులు, మరణాలు ఎన్నంటే.?