చంద్రబాబు నాయుడు అరెస్టు ఆంధ్రప్రదేశ్‌లో ప్రకంపనలు సృష్టింస్తోంది. తాజాగా చంద్రబాబు అరెస్టుపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కిల్ డెవలాప్‌మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారని ఆరోపించారు. స్కీల్ డెవలాప్‌మెంట్‌కు సంబంధించి.. 371 కోట్ల రూపాయలను కేబినెట్లో ఎలాంటి ఆమోదం లేకుండానే అర్జెంట్ ఫైల్‌గా పెట్టేశారని అన్నారు. అందులో కనీసం సెక్రటరీ సంతకాలు కూడా లేవని అన్నారు. ఆ కంపెనీ పెట్టిన పెట్టుబడిలో పదిశాతం ప్రభుత్వమే కట్టాలని చెప్పడం.. సెక్రటరీ వాళ్లు చెప్పినా వినకుండా స్వయంగా చంద్రబాబు నాయుడే ఈ స్కామ్‌కు సూత్రధారి అయ్యారని ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా ఆ సొమ్మును మొత్తం స్వాహా చేశారని అన్నారు. సీమెన్ కంపెనీకి అసలు సంబంధమే లేదని.. చంద్రబాబు నాయుడే డబ్బులు దోచుకున్నారని అన్నారు.
రెండు ఎకరాలు ఉన్న వ్యక్తికి మూడు లక్షల కోట్లు ఎలా వచ్చాయని మంత్రి కారుమూరి నాగేశ్వరావు ప్రశ్నించారు. ఇలాంటి కుంభకోణాలు చేయబట్టే వచ్చాయని అన్నారు. అయితే దీనిపై ఈడీ, ఐటీ శాఖలు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ను మానసిక క్షోభకు గిరిచేసిన పాపం ఇప్పుడు పండిందంటూ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇక జైలులో ఊచలు లెక్కపెట్టడమేనంటూ పేర్కొన్నారు.
చంద్రబాబు అరెస్టు..
చంద్రబాబు నాయుడ్ని తెల్లవారుజామున సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని మెజిస్ట్రేట్ ముందు ఆయనను హాజరు పర్చనున్నారు. మరోవైపు చంద్రబాబును అరెస్టు చేయడాన్ని టీడీపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హెచ్చరిస్తున్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. టీపీడీ నేతల్ని ఇప్పటికే పోలీసులు గృహ నిర్భందం చేశారు. అలాగే టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడ్ని కూడా పోలీసులు గృహ నిర్భందం చేశారు. ఆయనను ఎవరూ కూడా కలవకుండా ఆంక్షలు విధించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..