ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీం త్వరలోనే అమల్లోకి రానుంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంలో ఉన్న ఉద్యోగులను గ్యారంటీ పెన్షన్ స్కీంలోకి తీసుకొచ్చేలా కొత్త బిల్లుకు శాసనసభ ఆమోదముద్ర వేసింది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సీపీఎస్ రద్దుపై హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరిస్తామని చెప్పారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఖజానా నుంచి చెల్లిస్తున్న ఖర్చు, రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై పడే ఆర్ధిక భారం వంటి అంశాలను లెక్కలేసుకున్న సర్కార్ పాత పెన్షన్ విధానం అమలుపై పునరాలోచనలో పడింది. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ అమలుచేయాలంటే రాబోయే రోజుల్లో భరించలేనంత భారం ప్రభుత్వంపై పడుతుందని లెక్కలేసింది.
ఇదే సమయంలో పలు రాష్ట్రాలు సీపీఎస్ ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలుచేయడంపైనా అధ్యయనం చేసింది. సీపీఎస్ రద్దు కోసం ప్రత్యేకంగా అధికారులు,మంత్రులతో కూడిన కమిటీని వేసింది. ఈ కమిటీ అనేక రకాలుగా అధ్యయనం చేయడంతో పాటు ఉద్యోగ సంఘాలతో అనేకమార్లు సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను తీసుకుంది. సీపీఎస్ వల్ల ఉద్యోగి పదవీవిరమణ తర్వాత అసలు ఎంతమేర పెన్షన్ వస్తుందో తెలియని పరిస్థితి. దీంతో ఇలాంటి పరిస్థితి లేకుండా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం స్థానంలో కొత్తగా గ్యారంటీ పెన్షన్ స్కీంను తెరమీదికి తెచ్చింది. అలాగే జీపీఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.
శాసనసభలో గ్యారంటీ పెన్షన్ స్కీమ్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ప్రవేశ పెట్టారు. బిల్లు ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది.. ఉద్యోగులకు ఎలాంటి మేలు జరుగుతుంది వంటి అంశాలను అసెంబ్లీలో సుదీర్ఘంగా వివరించారు మంత్రి బుగ్గన. సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలుచేయాలనేది ఉద్యోగుల డిమాండ్. అయితే ప్రస్తుత, రాబోయే ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఆర్థికభారం పడకుండా ఉండాలని జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఓపీఎస్‌కు దాదాపు సమానంగా ఉండేలా గ్యారంటీ పెన్షన్ స్కీంను తీసుకొచ్చినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. పాత పెన్షన్ విధానం అమలు చేస్తే 2050 నాటికి 49 వేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని లెక్కలు వేశారు. దీనివల్ల స్థూల ఉత్పత్తిపై పెన్షన్ కు చేసే వ్యయం 107 శాతానికి వెళ్తుందని అంచనా వేసింది సర్కార్. ఒక దశకు వచ్చే సరికి ఆర్ధిక వ్యవస్థ మొత్తం స్థంభించి పోయే పరిస్థితి వస్తుందని ప్రభుత్వం చెబుతుంది. ఉద్యోగి విరమణ చేసే సమయానికి చివరి నెల వేతనంలో 50 శాతం పెన్షన్ ఇచ్చేలా జీపీఎస్ ను తీసుకొచ్చింది. పాత పెన్షన్ విధానంలో కూడా ఇదే విధంగా ఉంది. ఇక భార్య లేదా భర్తకు కూడా 60 శాతం పెన్షన్ ఇచ్చేలా బిల్లులో రూపకల్పన చేశారు.
డియర్నెస్ అలవెన్స్ మాత్రం పాత పెన్షన్ విధానంలో ఉండేది. కానీ జీపీఎస్ లో డీఆర్ ఉండదు. పాత పెన్షన్ విధానంలో ఉద్యోగుల హెల్త్ స్కీం సౌకర్యం లేదు. కానీ జీపీఎస్‌లో ఉద్యోగులతో సమానంగా పెన్షనర్లకు కూడా ఈహెచ్ఎస్ ను అందుబాటులోకి తెచ్చింది. సీపీఎస్ విధానంలో రిటైర్ మెంట్ తర్వాత అసలు పెన్షన్ ఎంత వస్తుందనే దానిపై సరైన లెక్క లేదు. కానీ జీపీఎస్ ద్వారా కనీసం బేసిక్ జీతంలో 50 శాతం పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం బిల్లులో పొందుపరిచింది. ప్రస్తుతం సీపీఎస్ లో ఉన్న ఉద్యోగులు నిర్ధిష్ట కాలపరిమితి లోగా జీపీఎస్ లో చేరాలని స్పష్టం చేసింది.
ఉద్యోగులంతా అర్ధం చేసుకోవాలని కోరిన మంత్రి బుగ్గన
గ్యారంటీ పెన్షన్ స్కీంను మెజారిటీ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు..పాత పెన్షన్ విధానమే అమలుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉద్యోగులు కూడా ప్రభుత్వంలో భాగమేనని.. ఉద్యోగుల కష్టాన్ని సీఎం జగన్ గుర్తించారని బుగ్గన అన్నారు. ప్రస్తుత, భవిష్యత్తులో ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా ఉండేలా జీపీఎస్ విధానాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఉద్యోగులంతా అర్ధం చేసుకుని సహకరించాలని మంత్రి బుగ్గన కోరారు.