
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్‌డేట్ వచ్చింది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్.. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో ఉన్న ఓటర్ల జాబితానే స్థానిక సంస్థల ఎన్నికలకు తుది జాబితాగా తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఫోర్సులో ఉన్న, చెల్లుబాటయ్యే ఓటర్ల జాబితానే ఎన్నికలకు ప్రాతిపదికగా తీసుకోవచ్చన్నది ప్రభుత్వం చెబుతున్న వాదన. అంటే.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితా వచ్చే వరకు ఎన్నికలను ఆపాల్సిన అవసరం లేదన్నది ప్రభుత్వ వైఖరి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే నాటికి చట్టబద్ధంగా అమల్లో ఉన్న ఓటర్ల జాబితాతోనే ఎన్నికల ప్రక్రియను కొనసాగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
బీసీ రిజర్వేషన్లపైనా న్యాయపరమైన చిక్కులు
మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశం కూడా కీలకంగా మారింది. రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు అభ్యంతరాలు వచ్చినా.. వాటిని అధిగమించే మార్గాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవసరమైతే పార్టీ పరంగా కూడా బీసీలకు ఓసీ జనరల్ కేటగిరీలో సీట్లు కేటాయించే అంశంపైనా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి కసరత్తు
ఓటర్ల జాబితా.. బీసీ రిజర్వేషన్లు.. ఈ రెండు అంశాలే ప్రస్తుతం స్థానిక ఎన్నికలకు సంబంధించి ప్రధాన న్యాయపరమైన సమస్యలుగా ఉన్నాయి. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకుని.. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎన్నికల షెడ్యూల్ కూడా దాదాపు స్పష్టమైన దిశలోనే ఉంది. తొలుత పురపాలక సంస్థల ఎన్నికలు.. ఆ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.
అక్టోబర్‌లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి
మొత్తంగా.. న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించుకుంటూ అక్టోబర్‌లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఎన్నికలు వాయిదా పడే ప్రసక్తే లేదని ఇప్పటికే స్పష్టం చేసిన ప్రభుత్వం.. కోర్టు కేసుల పరిష్కారంతో పాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లను వేగవంతం చేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.