AP Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి సివిల్‌ పోస్టులే అని స్పష్టం

|

Apr 15, 2021 | 9:56 AM

ఏపీలో హోంగార్డులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వారి విధులు సివిల్‌ పోస్టు కిందకు వస్తాయని పేర్కొంది. వివరణ తీసుకోకుండా, కారణాలు చెప్పకుండా...

AP Home Guards: హోంగార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ హైకోర్టు.. వారివి  సివిల్‌ పోస్టులే అని స్పష్టం
Ap Home Guards
Follow us on

ఏపీలో హోంగార్డులకు హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. వారి విధులు సివిల్‌ పోస్టు కిందకు వస్తాయని పేర్కొంది. వివరణ తీసుకోకుండా, కారణాలు చెప్పకుండా వారిని విధుల నుంచి తొలగించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. హోంగార్డుల్ని తొలగించే అధికారం కమాండెంట్‌కు మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో వివిధ కారణాలతో సర్వీసు నుంచి తొలగించిన హోంగార్డులకు ఊరట లభించింది. గతంలో పలువురు హోంగార్డులను తొలగిస్తూ పోలీసు ఉన్నతాధికారులు జారీచేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. హైకోర్టు పిటిషనర్లను తక్షణం సర్వీసులోకి తీసుకోవాలని ఆదేశాలు జారి చేసింది.

ఆంధ్రప్రదేశ్ హోంగార్డు చట్టం, మద్రాస్ హోంగార్డ్‌ చట్ట నిబంధనలు రాష్ట్రంలోని హోంగార్డులకు వర్తిస్తాయని కోర్టు పేర్కొంది. హోంగార్డుల ఎంపిక, విధుల స్వభావాన్ని చూస్తే వారిని సివిల్‌ సర్వెంట్లుగా పరిగణించాలని, ఆర్టికల్ 311(2) ప్రకారం విచారణ చేయకుండా వారిని తొలగించడానికి వీల్లేదని న్యాయమూర్తి చెప్పారు. హోంగార్డుల చేరిక, వారు అందించే సేవలు స్వచ్ఛందం(వాలంటరీ) అంటూ ప్రభుత్వం చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. పలు కేసుల్లో నిందితులుగా ఉండి నిర్దోషులుగా బయటకు వచ్చిన హోంగార్డులను తిరిగి విధుల్లోకి తీసుకోకపోవడం రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది. ఎస్పీ, పోలీసు కమిషనర్‌కు హోంగార్డులపై చర్యల కోసం సిఫార్స్ చేసే అధికారం మాత్రమే ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. తొలగింపు/సస్పెన్షన్‌పై నిర్ణయం ‘కమాండెంట్‌’కు ఉంటుందని వెల్లడించారు.

విధి నిర్వహణలో ప్రవర్తన,  క్రిమినల్‌ కేసులు, అక్రమ వసూలు, విధులకు గైర్హాజరు కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా విధుల నుంచి తొలగించిన హోంగార్డులు 2019, 2020, 2021లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపిన జస్టిస్‌ సత్యనారాయణమూర్తి ఇటీవల ఉమ్మడి తీర్పు వెలువరించారు.

Also Read: కౌలు రైతుగా మారిన సీబీఐ మాజీ జేడీ.. 10 ఎకరాల భూమిని బాడిగకు తీసుకుని వ్యవసాయం

బాలరామాయణం విడుదలై పాతికేళ్లు.. వెండితెరపై అద్భుతం చేసిన గుణశేఖర్