
ఏపీలోని అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆ సంస్థకు సంబంధించిన భూములను విక్రయించి.. వచ్చిన డబ్బుతో బాధితుల బకాయిలు క్లియర్ చేయాలని సీఐడీ అధికారులకు అదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక వడ్డీల ఆశ చూపి ఏజెంట్ల ద్వారా అగ్రిగోల్డ్ సంస్థ వందల కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించిన సంగతి తెలిసిందే. ఏజెంట్లకు కమీషన్లు ఇస్తూ పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసిన ఆ సంస్థ, సకాలంలో డిపాజిట్‌దారులకు డబ్బులు తిరిగి చెల్లించలేక చేతులెత్తేసింది. డిపాజిట్ల రూపంలో వచ్చిన డబ్బుతో అగ్రిగోల్డ్ భారీగా భూములను కొనుగోలు చేసింది.
అయితే ప్రస్తుతం ఆ భూముల విలువ గణనీయంగా పెరిగినప్పటికీ, బాధితులకు మాత్రం బకాయిలు అందలేదు. గతంలో కొంతమేర భూములు అమ్మి డబ్బులు చెల్లించినా, ఆ తర్వాత ఆరేళ్లయినా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదు. అయితే తాజాగా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి వివాదాలు, సమస్యలు లేని అగ్రిగోల్డ్ భూములను విక్రయించి, ఆ ద్వారా వచ్చే మొత్తంతో బాధితులకు బకాయిలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్నూలు ప్రాంతీయ సీఐడీ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేసింది.
బాధితులతో సీఐడీ అధికారుల వరుస సమావేశాలు
ఇక ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు అగ్రిగోల్డ్ బాధితులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అధికారులు నిర్ణయించిన తేదీ, ప్రాంతం ప్రకారం బాధితులు సీఐడీ కార్యాలయానికి చేరుకుని తమ ఒరిజినల్ పత్రాలను అధికారులతో సరిపోల్చుకుంటున్నారు. పత్రాల పరిశీలన కార్యక్రమం పూర్తయ్యేలోగా వివాదాలు లేని భూములను ప్రభుత్వం వేలం ద్వారా విక్రయించనుంది. తద్వారా వచ్చిన డబ్బును బాధితులందరికీ సమానంగా పంపిణీ చేయాలని సీఐడీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం, అధికారుల చర్యలతో ఎట్టకేలకు తమకు న్యాయం జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితుల్లో కొత్త భరోసా నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.