Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..

మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను వేగంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం డ్రోన్ వైద్య సరఫరా వ్యవస్థను ప్రారంభిస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 60–80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ఆరోగ్య కేంద్రాలకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనుంది. కోల్డ్ చైన్ సదుపాయంతో కూడిన ఈ డ్రోన్లను రక్తం, ఇతర నమూనాల రవాణాకు కూడా వినియోగించనున్నారు.

Andhra: ఏపీలోని గిరిజన ప్రాంతాల ప్రజలకు గుడ్ న్యూస్..
Andhra Tribes

Edited By:

Updated on: Dec 24, 2025 | 8:20 PM

మారుమూల గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలను మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్డు సదుపాయాలు పరిమితంగా ఉన్న కొండ ప్రాంతాలకు ఇకపై డ్రోన్ల ద్వారా మందులు, వైద్య సామగ్రి సరఫరా చేయనుంది ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కిరెడ్ వింగ్’ అనే ప్రైవేట్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డ్రోన్ వైద్య సేవలను అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా నిర్వహించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక, సామాజిక ఆరోగ్య కేంద్రాలకు వేగంగా మందులు చేరవేయడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.

పాడేరు కేంద్రంగా డ్రోన్ కార్యకలాపాలు

పాడేరును హబ్‌గా తీసుకుని.. 60 నుంచి 80 కిలోమీటర్ల పరిధిలోని గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. ఈ డ్రోన్లలో కోల్డ్ చైన్ సదుపాయం ఉండటంతో వ్యాక్సిన్లు, కీలక మందులు పాడవకుండా రవాణా చేయవచ్చని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఒక్కో డ్రోన్ సుమారు 2 కిలోల బరువును మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. డ్రోన్లను కేవలం మందుల రవాణాకు మాత్రమే కాకుండా, గిరిజన ప్రాంతాల్లోని రోగుల నుంచి సేకరించిన రక్తం, మల, మూత్ర నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు తీసుకొచ్చేందుకు కూడా వినియోగించనున్నారు. దీంతో పరీక్షా ఫలితాలు త్వరగా అందే అవకాశం ఉండటంతో పాటు, చికిత్సలో జాప్యం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.

ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్‌గా ఉచిత సేవలు

ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్‌లో డ్రోన్ వైద్య సేవలను విజయవంతంగా అమలు చేస్తున్న రెడ్ వింగ్ సంస్థ, రాష్ట్రంలోనూ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద మొదటి 6–7 నెలల పాటు ఉచితంగా సేవలు అందించేందుకు అంగీకరించింది. ఈ ఒప్పందం రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండ్యన్, సంస్థ ప్రతినిధి కుందన్ మాదిరెడ్డి మధ్య కుదిరినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వచ్చే నెలాఖరు నుంచి డ్రోన్ ద్వారా

ఈ డ్రోన్ సేవలు వచ్చే నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయని కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. గిరిజన కొండ ప్రాంతాల్లో రోడ్డు మార్గాల ద్వారా మందులు పంపడం సమయం తీసుకునే పని కావడంతో, అత్యవసర పరిస్థితుల్లో డ్రోన్లే ప్రాణాలు కాపాడే సాధనంగా మారనున్నాయని అధికారులు అంటున్నారు.

భవిష్యత్‌లో కేజీహెచ్–పాడేరు మధ్య విస్తరణ

డ్రోన్ సేవలను భవిష్యత్‌లో మరింత విస్తరించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. విశాఖపట్నం కేజీహెచ్ నుంచి పాడేరుకు కూడా మందుల రవాణాకు డ్రోన్లను వినియోగించాలన్న ప్రణాళికను పరిశీలిస్తోంది. ఈ విధానం అమలైతే గిరిజన ప్రాంతాలకు అత్యవసర వైద్య సేవలు మరింత వేగంగా అందనున్నాయని వైద్యవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.