
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 24 నుంచి రైతన్నా మీ కోసం కార్యక్రమం చేపట్టనుంది. వ్యవసాయ రంగంలో సమూల మార్పు దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సాగును లాభసాటిగా మార్చేందుకు పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా పంచ సూత్రాల ద్వారా రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ఈ నెల 24 నుంచి కార్యక్రమాలు చేపట్టనుంది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుంబంధ రంగాలు, మార్కెటింగ్ శాఖ అధికారులు పాల్గొననున్నారు.
వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో పాటు రైతు సేవా కేంద్రాల సిబ్బందితో సహా 10 వేల మంది రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్నదాతల సంక్షేమం కోసం, సాగు విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్లనున్నారు. డిసెంబర్ 3వ తేదీన రైతు సేవా కేంద్రాల పరిధిలో వర్క్‌షాపులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ‘రైతన్నా మీ కోసం’ పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించనున్నారు. రైతులకు వ్యవసాయం గిట్టుబాటు అయ్యేలా ఆధునిక పద్ధతుల ద్వారా ప్రకృతి సేద్యాన్ని మరింతగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు సీఎం. దీని వల్ల భూసార రక్షణతో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే పొలం పిలుస్తోంది కార్యక్రమం కూడా చేపడుతున్నట్లు చెప్పారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అంశాలతో పంచ సూత్రాల విధానం ఉంటుందని సీఎం తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..