Andhra: సమయం లేదు మిత్రమా.! మార్చి 31 వరకే అవకాశం.. ఆస్తి పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్..
ఆస్తి పన్ను బకాయిల వసూళ్లకు ఏపీ ప్రభుత్వం స్పెషల్ నిర్వహిస్తోంది. వడ్డీపై భారీ రాయితీతో ఇవాళ, రేపు ప్రాపర్టీ టాక్స్ వసూలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి మరి.

ఆస్తి పన్ను బకాయిలపై 50శాతం వడ్డీ రాయితీ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ ఇవాళ, రేపు పన్ను వసూళ్ల కౌంటర్లు పని చేసేలా చర్యలు చేపట్టింది. వడ్డీపై రాయితీ వినియోగించుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. దాంతో.. గత రెండు రోజులుగా పట్టణ ప్రజలు పెద్దఎత్తున పన్ను బకాయిలు చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. విశేష ఆదరణ లభిస్తుండడంతో ఆది, సోమవారాల్లోనూ ఆస్తి పన్ను వసూలు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు రోజుల పాటు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు పని చేసేలా ఏపీ మున్సిపల్ శాఖ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాలని కార్పోరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కమిషనర్లను మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.
2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్ను బకాయిలను రేపటిలోగా ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 50శాతం రాయితీ ఇస్తామని ఏపీ ప్రభుత్వం జీవో 46లో తెలిపింది. ఇక.. ఆస్తి పన్ను బకాయిల వసూళ్ల డ్రైవ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ, రేపు ఆయా ప్రాంతాల్లోని పలు శాఖల అధికారులకు సెలవులు లేవని స్పష్టం చేసింది. ఏపీ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయాలకు పని దినాలుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండు రోజులపాటు ఆఫీసులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పనిచేస్తాయని తెలిపారు. ఆస్తిపన్ను బకాయిలు ఒకేసారి చెల్లించిన వారికి 50 శాతం వడ్డీ రాయితీ ప్రకటించడంతో ఈ సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.