Bojjala Gopala Krishna Reddy: మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, చంద్రబాబు

| Edited By: Janardhan Veluru

May 06, 2022 | 5:47 PM

Bojjala Gopala Krishna Reddy: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గోపాలకృష్ణరెడ్డి.. కొద్దిసేపటి క్రితం అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.

Bojjala Gopala Krishna Reddy: మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్, చంద్రబాబు
Bojjala Gopalkrishna Reddy
Image Credit source: TV9 Telugu
Follow us on

Bojjala Gopala Krishna Reddy Death News: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి(73) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల తీవ్ర అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు ఆయన కుటుంబ సభ్యులు. సీపీఆర్ ద్వారా డాక్టర్లు చికిత్స అందిస్తుండగా గుండెపోటుతో బొజ్జల తుది శ్వాస విడిచారు. గత నెల 15న బొజ్జల జన్మదినం కాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేక్ కట్ చేసి తినిపించారు.  1949 ఏప్రిల్ 15వ తేదీన జన్మించిన బొజ్జల గోపాలకృష్ణరెడ్డి శ్రీకాళహస్తి నుంచి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 1999, 2009, 2014లలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఐటీశాఖ మంత్రిగా పని చేసిన బొజ్జల.. రాష్ట్రం విడిపోయాక అటవీశాఖ మంత్రిగా సేవలు అందించారు. కాగా, బొజ్జల గోపాలకృష్ణరెడ్డి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,  చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

బొజ్జల గోపాలకృష్ణరెడ్డి రాజకీయ ప్రస్థానం..

1949 ఏప్రిల్ 15వ తేదీన శ్రీకాళహస్తిలోని ఊరందూరు‌లో బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి జన్మించారు. ఆయన భార్య పేరు బృంద.. వీరికి ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. వారి పేర్లు పద్మ, సుధీర్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన నేత బొజ్జల గోపాలకృష్ణరెడ్డి.. ఆయన శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తొలిసారిగా 1989లో శ్రీకాళహస్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బొజ్జల గోపాలకృష్ణరెడ్డి.. 1994-2004 మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు మంత్రి వర్గంలో ఐటీ మంత్రి, రోడ్లు-భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు 2003లో తిరుమల సమీపంలోని అలిపిరిలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌‌లో.. చంద్రబాబుతో పాటు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కూడా గాయాలయ్యాయి. అటు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతినిధి ఎస్సీవీ నాయుడు చేతిలో ఓటమిపాలైన బొజ్జల.. 2009 ఎన్నికల్లో అదే నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లోనూ వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూధన్‌ రెడ్డిపైనా 7,583 ఓట్ల మెజారిటీతో బొజ్జల విజయం . చంద్రబాబు కేబినెట్‌లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత అనారోగ్యాన్ని కారణంగా చూపుతూ బొజ్జలను చంద్రబాబు మంత్రి పదవి నుంచి తప్పించారు.