సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం నుంచే భగ్గుమంటున్నాడు. ఫలితంగా బయట అడుగు వేస్తేనే.. నిప్పుల కొలిమిలో అడుగు వేసినట్టుగా అనిపిస్తోంది. ఏదైనా పని నిమిత్తం బయటకు వెళ్లాలన్నా.. వడగాల్పుల భయంతో ఇంటికే పరిమితమవుతున్నారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రయాణాలకూ దూరంగానే ఉంటున్నారు. ఏపీలో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత అధికంగా వుండనుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఈ మూడురోజుల్లో నమోదయ్యే అవకాశాలున్నాయని… ప్రజలు అప్రమత్తంగా వుండాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా వృద్దులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా వుండాలని… అవసరం వుంటే తప్ప బయటకు వెళ్లరాదని సూచించారు.
ఇవాళ 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ,ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతుండగా తాజాగా విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎండల తీవ్రత అధికంగా వుండే జిల్లాలు, మండలాల అధికారులకు విపత్తుల సంస్థ పలు సూచనలు ఇచ్చింది. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిందిగా అధికారులు హెచ్చరిస్తోంది. ఇక అటు తెలంగాణలోనూ ఎండలు దంచికొడుతున్నాయి. ఇటీవల వర్షాలు కురవడంతో ఎండల నుంచి ఊరట కలిగింది. ప్రస్తుతం వానలు తగ్గుముఖం పట్టడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం