AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jagan: గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలుః సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవ శకం మొదలైంది. కొత్త జిల్లాల నుంచి పరిపాలన ప్రారంభమైంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాలుగా రూపు మార్చుకుంది

AP CM YS Jagan: గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణతో ప్రజలకు మేలుః సీఎం జగన్‌
Ap
Balaraju Goud
|

Updated on: Apr 04, 2022 | 2:00 PM

Share

AP CM YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నవ శకం మొదలైంది. కొత్త జిల్లాల(AP New Districts) నుంచి పరిపాలన ప్రారంభమైంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ 26 జిల్లాలుగా రూపు మార్చుకుంది. 13 కొత్త జిల్లాలు, 21 కొత్త రెవెన్యూ డివిజన్లను వర్చువల్‌గా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్త కలెక్టర్లు, ఎస్పీలు, RDOల బాధ్యతల స్వీకారంతో పండుగ వాతావరణం నెలకొంది. క్యాంప్‌ కార్యాలయం నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్‌.. పాలనా వికేంద్రీకరణలో భాగంగానే కొత్త జిల్లాల ఏర్పాటని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ప్రణాళికశాఖ రూపొందించిన జిల్లాల సమగ్ర సమాచారంతో కూడిన డిస్ట్రిక్ట్‌ హేండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ను విడుదల చేశారు సీఎం.

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల్లో పరిపాలన మొదలైంది. అనుకున్న ముహూర్తం ప్రకారం ఒకేసారి 13 కొత్త జిల్లాలను, 21 రెవెన్యూ డివిజన్లను వర్చువల్‌గా ప్రారంభించారు సీఎం జగన్‌. కొత్తగా నియమితులైన కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలకు విషెస్‌ చెప్పారు సీఎం జగన్‌. ప్రతి ఒక్కరూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. గతంలో అనుకున్న దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేశామని, ప్రజల సూచనల ప్రకారం 12 నియోజకవర్గాల్లోని మండలాలను మార్చామని చెప్పారు. కుప్పం ఎమ్మెల్యే డిమాండ్‌ మేరకు అక్కడ కూడా రెవెన్యూ డివిజన్‌ పెట్టామని సీఎం జగన్ అన్నారు. 26 జిల్లాల ఏపీ రాష్ట్రంగా రూపుమారుతున్న సందర్భంగా.. ప్రజలకు, అధికారులకు, ఉద్యోగులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు సీఎం వైఎస్‌ జగన్‌. కొత్త జిల్లాల పేర్లను స్వయంగా చదివి వినిపించిన ఆయన.. ప్రజల సెంటిమెంట్లను, గొప్పవాళ్లను పరిగణనలోకి తీసుకున్నాకే జిల్లాలను ఏర్పాటు చేశామని, వాటికి పేర్లు కూడా పెట్టినట్లు వెల్లడించారు.

వికేంద్రీకరణపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం జగన్‌. గ్రామ స్థాయి నుంచి రాజధానుల వరకు పరిపాలన వికేంద్రీకరణే తమ విధానమని తేల్చి చెప్పారు. దాని ద్వారానే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పారు. కుప్పం ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకే కుప్పంను రెవెన్యూ డివిజన్‌ చేశామని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై వచ్చిన అన్ని రకాల అభ్యంతరాలు, సూచనలను క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేసేందుకు ప్రణాళిక శాఖ కార్యదర్శి, సీసీఎల్‌ఏ కార్యదర్శి, అన్ని జిల్లాల కలెక్టర్లతో ఒక కమిటీని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. జిల్లాల ఏర్పాటు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉండడంతో ప్రజల నుంచి వచ్చే ప్రతి అంశాన్ని పరిశీలించి, అవసరమైన సమాచారంతో విస్తృతంగా అధ్యయనం చేశాకే దానిపై నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్‌ ఈ కమిటీకి సూచించామన్నారు. సుమారు 17,500 సలహాలన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి తుది సిఫారసు చేసింది. తద్వారా కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేసినట్లు సీఎం తెలిపారు.

ఏపీతో పోలిస్తే తక్కువ జనాభా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలోనే 26 జిల్లాలు ఉన్నాయని చెబుతూ.. జనాభా ప్రతిపాదికన చూసుకుంటే ఏపీకి జిల్లాల ఏర్పాటు అవసరం తప్పక ఉందని పేర్కొన్నారు. ఇంతకు ముందు 38 లక్షల 15 వేల మందికి ఒక జిల్లా ఉండేదని.. ఇప్పుడు 26 జిల్లాల ఏర్పాటుతో 19 లక్షల 7 వేల మందికి ఒక జిల్లా ఉంటుందని తెలిపారు. గిరిజన జిల్లాల్లో మినహా 6 నుంచి 8 అసెంబ్లీ సెగ్మెంట్‌లతో ఒక జిల్లా ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్‌ తెలిపారు. కొత్త జిల్లాలతో మెరుగైన పాలనా, శాంతి భద్రతలు, పారదర్శకత.. ఉంటుందని సీఎం వెల్లడించారు. కాగా, జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ప్రతి చోటా పండుగ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచే మంత్రులు, ఎమ్మెల్యేలు కలెక్టరేట్‌లకు వచ్చి నూతనంగా బాధ్యతలు తీసుకున్న వారికి శుభాకాంక్షలు చెప్పారు. కొత్త కలెక్టరేట్ల నుంచే సీఎం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతినిధులు.