ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన ప్రతిపక్ష పార్టీలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ, తీవ్రస్థాయిలో విరుచుపడుతోంది. ఈ యాక్ట్ వల్ల మీ భూములు పోతాయని ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. భూముల పై రైతులకు సంపూర్ణ హక్కులు కలిగించటమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని వైఎస్ జగన్ స్పష్టం చేశారు.
వందేళ్ల తరువాత తొలిసారి సర్వే చేసి భూ రికార్డులు సిద్ధం చేశామన్నారు సీఎం జగన్. భూమిపై యజమానికి సర్వహక్కులు కల్పించేదే ఈ చట్టం అన్నారు. రాష్ట్రంలో 17వేల గ్రామాల్లో రెవెన్యూ రికార్డులు అప్‌డేట్ చేశామని, టైటిల్స్‌లో తప్పులు దొర్లకుండా చూడడం ప్రభుత్వ గ్యారెంటీ అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూములకు టైటిల్ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
గ్రామ సచివాలయాలే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులుగా గొప్ప మార్పు తీసుకువచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్, ల్యాండ్ రిజిస్ట్రేషన్ రెండూ ఒకటి కాదన్న జగన్, భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పు దేశమంతటా జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు.
గతంలో కార్డ్-1 ప్రక్రియ ఉండేదని, ఇప్పుడు అమల్లోకి కార్డ్-2 ప్రక్రియ మాత్రమే తీసుకువస్తున్నట్లు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చంద్రబాబు వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జిరాక్స్ కాపీలు ఇస్తారన్నది తప్పు అన్న జగన్.. ఒరిజినల్స్ ఇస్తారని, ఇప్పటి వరకు 9 లక్షల మంది ఒరిజినల్స్ తీసుకున్నారని జగన్ తెలిపారు. రాజకీయాల కోసం చంద్రబాబు దిగజారిపోవడం అన్యాయం అన్న జగన్, సచివాలయాల్లో 15వేల సర్వేయర్లతో వ్యవస్థను తీసుకొచ్చామన్నారు. ల్యాండ్ టైటిలింగ్ గురించి మోదీ-షా ముందు బాబు మాట్లాడగలడా? అని ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
జగన్ భూములు లాక్కుంటారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇది అతిపెద్ద సంస్కరణ అవుతుందని, భూముల కోసం ప్రజలు, రైతులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వారి భూములకు ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వటమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధాన ఉద్దేశమని జగన్ స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…