
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. జూబ్లిహిల్స్ పెద్దమ్మతల్లి గుడిలో కుటుంబసమేతంగా ప్రత్యేక పూజల అనంతరం… ఎల్బీ స్టేడియానికి వచ్చిన రేవంత్‌తో.. అతిరథ మహారథుల మధ్య గవర్నర్ తమిళిసై సీఎంగా ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పెద్దలంతా తరలివచ్చారు. సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలతో పాటు.. కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి ముందు.. ఓపెన్ టాప్ జీప్‌లో సోనియాతో కలిసి కార్యకర్తలకు అభివాదం చేస్తూ వచ్చారు రేవంత్. ప్రమాణం అనంతరం.. తన కుటుంబాన్ని సోనియాకు పరిచయం చేశారు రేవంత్. దంపతులిద్దరూ ఆమె పాదాలకు నమస్కరించారు. ఎల్బీస్టేడియంలో గ్రాండ్‌గా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి.. రాష్ట్ర నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చాయి. దీంతో స్టేడియం లోపల, బయటా… జనంతో కిక్కిరిసిపోయింది. ఆ చుట్టుపక్కలంతా సందడి వాతావరణం ఏర్పడింది. నేతలు, కార్యకర్తలు ఆనందంతో డ్యాన్సులు చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం.. రేవంత్ రెడ్డి అగ్రనేతల్ని స్వయంగా వీడ్కోలు పలికారు.
కాగా.. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు.
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023
ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పని చేశాయని అన్నారు. తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు భారీ మెజార్టీతో గెలిచారని అన్నారు. ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రెండు రాష్ట్రాల మధ్య సామరస్య వాతావరణం ఉండే విధంగా చూడాలని సూచించారు. కేంద్రం తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన విభజన హామీల అమలు కోసం నిలదీసేందుకు రేవంత్ రెడ్డి ముందుకు రావాలని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..