CM Jagan: ఆ కుటుంబాలకు వెంటనే 2వేలు ఇవ్వండి.. మాట రాకూడదు.. కలెక్టర్లకు జగన్ కీలక ఆదేశాలు
మాండూస్ తుఫాన్‌పై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులకు కీలక సూచనలు చేశారు. సాయం విషయంలో అస్సలు వెనక్కి తగ్గొద్దన్నారు.
మాండూస్ తుఫాన్‌తో జరిగిన నష్టాన్ని అంచనా వేసే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు ఏపీ CM జగన్. రంగుమారిన, తడిసిన ధాన్యమైనా సరే కొనుగోలు చేయలేదన్న మాట ఎక్కడా రాకూడదని కలెక్టర్లకు సూచించారు. ఒకవేళ రైతులు బయట అమ్ముకున్నా వారికి రావాల్సిన రేటు వచ్చేలా చూడాలని స్పష్టం చేశారు. ఇలాంటి సమయాల్లో అత్యంత మానవతా దృక్పథంలో ఉండాలని సూచించారు. ఎన్యుమరేషన్ విషయంలో ఉదారంగా వ్యవహరించాలన్నారు. వర్షాలతో జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు CM జగన్.
పంటలు దెబ్బతిన్నచోట మళ్లీ పంటలు వేసుకోవడానికి 80శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని చెప్పారు CM జగన్. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే.. ఒక్కో ఫ్యామిలీకి 2వేల రూపాయలతోపాటు, రేషన్ అందించాలని సూచించారు. వరదనీరు ఇంట్లోకి వచ్చి ఉంటే.. ఆ కుటుంబానికి పక్కాగా సాయం అందాలన్నారు. పట్టణాలు, పల్లెలు అన్నది చూడకుండా బాధితులందరికీ సహాయాన్ని అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
గోడ కూలి ఒకరు చనిపోయినట్లు తనకు తెలిసిందని.. ఆ ఫ్యామిలీకి వెంటనే పరిహారం అందించి.. ధైర్యం చెప్పాలని సీఎం సంబంధిత అధికారులకు సూచించారు. ఎవరైనా పశువులను నష్టపోయినా.. త్వరితగతిన పరిహారం అందించాలన్నారు. ఈ రోజే నమోదు ప్రక్రియ ప్రారంభం కావాలని.. ప్రాసెస్ అంతా వారంలోపే జరగాలని ఆదేశించారు. ఇలాంటి సమయాల్లో అండగా నిలబడితేనే ఆ అధికారులను, ఆ ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారని సీఎం స్పష్టం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..