Andhra Pradesh: సాకారం కానున్న విశాఖ రైల్వే జోన్‌ కల.. రైల్వే జోన్‌ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..

|

Oct 09, 2024 | 1:15 PM

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. అయితే త్వరలోనే ఏపీ వాసుల కల సాకారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వేజోన్‌ కార్యాలయం ఏర్పాటుకు డిసెంబర్ నెలలో శంకుస్థానన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించారు.

Andhra Pradesh: సాకారం కానున్న విశాఖ రైల్వే జోన్‌ కల.. రైల్వే జోన్‌ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..
Follow us on

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల. అయితే త్వరలోనే ఏపీ వాసుల కల సాకారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రైల్వేజోన్‌ కార్యాలయం ఏర్పాటుకు డిసెంబర్ నెలలో శంకుస్థానన చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇక పోలవరం డయాఫ్రం వాల్ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. దీంతోపాటు రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరామన్న సీఎం చంద్రబాబు, స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ పై ప్రధానికి వివరించినట్లు వెల్లడించారు.

ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రులను కలిసిన అనంతరం మీడియా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు వివరాలు వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కోసం గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే కార్యాలయం ఏర్పాటు కోసం స్థలం విషయంలో జాప్యం జరుగుతూ వస్తోంది. రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం గత ప్రభుత్వంలో కేటాయించిన భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్ర ప్రభుత్వం అడిగిన 52 ఎకరాల భూమిని సమకూర్చడంలో ఆలస్యమైంది. దీంతో రైల్వేజోన్ కార్యాలయం ఏర్పాటులో జాప్యం జరుగుతూ వస్తోంది. తాజాగా ఈ అడ్డంకులను తొలగిస్తూ రైల్వేశాఖ కోరిన భూమిని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించడంతో జోన్‌ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రైల్వే జోన్ కేంద్ర కార్యాలయ నిర్మాణం కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు వేగంగా తీసుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే డిసెంబర్ నెలలో విశాఖ రైల్వే జోన్ కు శంకుస్థాపన చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ లోనే వాల్తేరు రైల్వే డివిజన్ ఉంటుందని, జఠిలమైన సమస్యను పరిష్కరించామన్నారు. హౌరా నుండి చెన్నై రెండు రైల్వే లేన్లను 4 లేన్లుగా మార్చుతున్నారని తెలిపారు. దీంతో గూడ్స్, రైళ్ల రాకపోకలు పెరుగుతాయి. శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ప్రతి పట్టణం అనుసంధానం అవుతుంది. తద్వారా ఏకకాలంలో ఎకనమిక్, పోర్టు డెవలెప్మెంట్ తో పాటు పెరగనున్న ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే, విజయవాడ నుంచి అమరావతి లైన్ కు కేంద్రం అంగీకరించిందని, మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైనుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు.

అలాగే బుల్లెట్ ట్రైన్ ద్వారా అమరావతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు పట్టణాల అనుసంధానం చేయాలని కోరామన్న చంద్రబాబు, దేశం లోని కీలకమైన ఎకనమిక్ హబ్ ల గుండా బులెట్ ట్రైన్ ప్రయాణం జరుగుతుందన్నారు. బులెట్ ట్రైన్ అనుసంధానంతో పాటు ఎకానమీ ఆక్టివిటీస్ పెరుగుతాయన్నారు. 2026 నుండి బులెట్ ట్రైన్ పనులు ప్రారంభం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని ప్రతీ రైల్వే స్టేషన్ ను ఆధునీకరణ పూర్తి చేయాలని కోరామన్నారు. ఇక నడికుడి టూ శ్రీకాళహస్తి, కోటపల్లి టూ నర్సాపూర్, కడప టూ బెంగళూరు లైన్ల కోసం మ్యాచింగ్ గ్రాంట్ అడుగుతున్నారని తెలిపారు. ఇప్పటికే రూ.75 వేల కోట్ల రైల్వే పనులు రాష్ట్రంలో జరుగుతున్నాయని గుర్తు చేశారు.

ఇక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఏపీలో పెట్టేందుకు కేంద్రం సానుకూలంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. దీంతో సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి డిమాండ్ పెరుగుతుంది. దీనిపై పైనా వర్కవుట్ చేయాలి. లాభనష్టాలు బేరీజు వేసుకుని ముందుకెళ్తామన్నారు. ఫ్యాబ్రికేషన్ ఇండస్ట్రీకి ఏపీని కేరాఫ్ అడ్రెస్ గా నిలిపి, తద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన మెరుగుపరుస్తామన్నారు. డేటా సెంటర్ భవిష్యత్తులో మంచి ఫ్యూచర్ ఉంటుందని ఏపీ సీఎం ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పలు ప్రతిపాదనలు పంపామన్నారు. ఇందుకోసం ఏపీ సర్కార్ ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామన్నారు. ఏఐని సమగ్రంగా వినియోగించి సత్వర పాలనలో సత్వర ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీలో ఈనెల 22, 23 తేదీల్లో డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్నట్లు ఏపీ సీఎం తెలిపారు. గతంలో ఐటీని ప్రోత్సహించించిన విధంగా నేడు కృత్రిమ మేథను ప్రోత్సహిస్తామని సీఎం తెలిపారు.

రాష్ట్రంలో రోడ్ల విస్తరణ అభివృద్ధికి కేంద్ర పూర్తి సాయం అందించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ వెస్టర్న్ బైపాస్ పూర్తవ్వగానే ఈస్టర్న్ బైపాస్ ప్రారంభం అవుతుందని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. అలాగే రాష్ట్రంలోని స్టేట్ హైవేలు పూర్తి చేయాలని గడ్కరీని కోరామన్నారు. రహదారులకు సంబంధించి ఇప్పటికే రూ.50 వేల కోట్ల విలువైన పనులు నడుస్తున్నాయని తెలిపారు. రెండేళ్లలో యుద్ధ ప్రాతిపదికన హైవేలు పూర్తి చేయాలని కోరామన్నారు. కుప్పం-హోసూరు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ రోడ్, మూలపేట నుండి వైజాగ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి ఏర్పాటుతో ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు చేయాలని కోరామన్నారు.

భోగాపురం ఎయిర్ పోర్టుకు, విశాఖ బీచ్ కు ఈ రోడ్ ను అనుసంధానం చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. 2025 డిసెంబర్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. అలాగే, విజయవాడ నుండి హైదరాబాద్ కు ఎక్స్ ప్రెస్ హైవే ఏర్పాటును కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు. అమరావతి 183 కి.మీ ఔటర్ రింగ్ రోడ్ పైనా కేంద్రం తో చర్చించినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఏపీ జీఎస్టీ వదులుకోవడంతో పాటు ప్రభుత్వ స్థలాలు ఇవ్వడానికి సిద్దమని తెలిపాం. 2.5 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కోరామన్నారు. గత ప్రభుత్వం అనంతపురం, అమరావతి హైవేను అమరావతి కడపకు మార్చింది. కొత్తవలసలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తే సాలూరుకు మార్చారు. సముద్ర తీరం వెంట 22 వేల ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ఉంది. దాన్ని కూడా అప్పగిస్తే ఇండస్ట్రియల్ కు ఉపయోగించుకోవచ్చని కోరామని చంద్రబాబు తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులను కూటమి ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లో చేయదు. ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కుల పనులు కూడా ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు. లెథర్ పాలసీ తీసుకొచ్చి ప్రమోట్ చేస్తామన్నారు. పీఎం ఉజ్వల కింద ఏపీకి ఇవ్వాల్సిన 65 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కోరామన్నారు. దీపం పథకం కింద కేటాయించాలని కేంద్ర మంత్రి హర్ దీప్ సింగ్‌ను కోరామన్నారు. బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుపైనా అధ్యయనం జరుగుతోందన్న చంద్రబాబు, రామాయపట్నం, మచిలీపట్నం, మూలపాడులు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎన్.హెచ్.పీ.సీ రూ.1 లక్ష కోట్ల పెట్టుబడితో ఏపీ జెన్ కో గ్రీన్ హైడ్రోజన్ కోసం ముందుకెళ్తున్నామన్నారు. వచ్చే నెలలో ఈ ప్రాజెక్టుకు విశాఖలో ఫౌండేషన్ వేస్తామన్నారు.

అలాగే, విశాఖ ఉక్కుపై కుమారస్వామితో చర్చించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రత్యామ్నాయ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటున్నామన్నారు. రూ. 15 వందల కోట్లు ఇప్పటిదాకా నిధులు కేటాయించారు. ఇబ్బందులను అధిగమించుకుని ముందుకు వెళ్లాలని చూస్తున్నామని సీఎం తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం అన్న చంద్రబాబు. కొంత యాజమాన్య నిర్ణాయాల కారణంగా విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల్లో పడిందన్నారు. సెయిల్ లో విలీనం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తాత్కాలిక నిధులతో సమస్య పరిష్కారం కాదు. ప్రైవేటైజేషన్ కాకుండా చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులను సరిగా వినియోగించలేదన్న ఏపీ సీఎం, కుళాయి ద్వారా నీళ్లందించే అవకాశాన్ని ఉపయోగించలేదన్నారు.

ఎఫ్ఆర్బీఎం పరిధి దాటి గత ప్రభుత్వం ఇష్టారీతిన అప్పులు చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. రూ. 10 లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని గత ప్రభుత్వం చేసిందన్నారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసమే కేంద్రంతో పదేపదే మాట్లాడతున్నామని, ఏపీలో జాతీయ రహదారులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. చిన్నపాటి భూ సమస్యలు కూడా పరిష్కరించలేదన్నారు. రైల్వే లైన్ల గురించి, అండర్ పాస్ లు, స్టేషన్ల ఆధునీకరణ గురించి పట్టించుకోలేదు. కనీసం మ్యాచింగ్ గ్రాంటు ఇవ్వకపోవడం వల్ల పనులు నిలిచిపోయాయి. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఖర్చు పెట్టిన వాటికి కనీసం గత ప్రభుత్వం యూసీలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..