ఏపీలో గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించింది కూటమి ప్రభుత్వం. ఏకంగా 13వేల 326 గ్రామ పంచాయతీల్లో ఒకేసారి గ్రామసభలు పెట్టారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గ్రామ సభలు ప్రారంభించారు. జగన్ పాలనను విమర్శించడానికి గ్రామసభలను వేదికగా మార్చుకుంది కూటమి ప్రభుత్వం. వచ్చే ఐదేళ్లలో గ్రామాల్లో 17వేల 500 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు, 10 వేల కిలోమీటర్ల సిమెంట్ డ్రైనేజీలు, 2,500 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు సీఎం చంద్రబాబు.
పశువుల షెడ్ల కోసం ఆర్థిక సాయం, చెత్త నుంచి సంపద సృష్టి, గ్రామాల్లోని పేదలకు మూడు సెంట్లు, పట్టణ పేదలకు రెండు సెంట్ల భూమి ఇస్తామని మరోసారి హామీ ఇచ్చారు. ఒకప్పుడు సీఎం వస్తున్నారంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవో.. ఇప్పుడెలా ఉందో గమనించాలని ప్రజలను కోరారు సీఎం చంద్రబాబు. నిజానికి 70 శాతం సర్పంచ్‌లు వైసీపీకి చెందిన వారే. టీడీపీ, జనసేన, బీజేపీ సర్పంచ్‌లు 30 శాతం ఉంటారని అంచనా. అయినా సరే.. గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాజకీయాలను పక్కనపెట్టామన్నారు పవన్ కల్యాణ్. అవసరమైతే గూండా యాక్ట్ తీసుకొస్తామంటూ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇకపై ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఐదేళ్లలో 20 సార్లు ఇలాంటి గ్రామసభలు నిర్వహిస్తామంటోంది ప్రభుత్వం.