Pawan Kalyan: భీమవరం నుంచి మళ్లీ పోటీకి సై అంటున్న పవన్.. అక్కడ గెలవాలంటే జనసేనాని ముందున్న సవాళ్లు ఇవే..!

| Edited By: Janardhan Veluru

Jul 05, 2023 | 1:24 PM

Pawan Kalyan: సిఎం..సిఎం అని అరిస్తే నేను ముఖ్యమంత్రిని కాలేను.. మీరంతా నాకు ఓట్లు వేసి గెలిపించాలి.. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోట ఇటీవల సభల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. అయితే సిఎం కావడం అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా  కూడా గెలవలేరన్నది ఆయన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతల నుంచి వస్తున్నమాట.

Pawan Kalyan: భీమవరం నుంచి మళ్లీ పోటీకి సై అంటున్న పవన్.. అక్కడ గెలవాలంటే జనసేనాని ముందున్న సవాళ్లు ఇవే..!
Pawan Kalyan (File Photo)
Follow us on

పశ్చిమ గోదావరి జిల్లా:  సిఎం..సిఎం అని అరిస్తే నేను ముఖ్యమంత్రిని కాలేను.. మీరంతా నాకు ఓట్లు వేసి గెలిపించాలి.. ఇది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నోట ఇటీవల సభల్లో తరుచుగా వినిపిస్తున్న మాట. అయితే సిఎం కావడం అటుంచితే అసలు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా  కూడా గెలవలేరన్నది ఆయన్ని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతల నుంచి వస్తున్నమాట. అయితే ఈసారి తన గెలుపును ఎవరు ఆపలేరు.. జనసేన అసెంబ్లీ లో అడుగు పెట్టటం ఖాయం అని ఇటీవల తన వారాహి యాత్ర సందర్భంగా శపధం చేసిన పవన్ కళ్యాణ్.. తన మొత్తం 15 రోజుల పర్యటన లో నాలుగు రోజుల పాటు భీమవరంలోనే బస చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలుత అనారోగ్యంగా ఉందని , 102 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారని జనసేన నేతలు ఈ సందర్భంగా బయటకు చెప్పారు. అయితే ఇదే సందర్భంలో వివిధ వర్గాల ప్రజలను కలుసుకోవటం పక్కన పెడితే ” బ్రో ” సినిమా టీజర్ కు అయన డబ్బింగ్ చెప్పటం అయనకు భీమవరంలో ప్రధాన ప్రత్యర్థి అయిన గ్రంధి శ్రీనివాస్ కు ఆయుధంగా మారింది. ఇది రాజకీయపరమైన విమర్శగా పక్కన పెట్టినా.. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంపై పార్టీ నేతలకు క్లారిటీ వచ్చేసిందన్నది ఇపుడు భీమవరం కేంద్రంగా బయట జరుగుతున్న ప్రచారం. పవన్ మళ్లీ భీమవరం బరిలోనే నిలుస్తారంటూ బలమైన సంకేతాలు సైతం ఆ పార్టీ నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా రెండో దఫా వారాహి విజయ యాత్ర షెడ్యూల్ రేపో, మాపో విడుదలవుతుంది. అది భీమవరం నుంచి మొదలైనా లేదా ఏలూరులో మొదలై ఉంగుటూరు , తాడేపల్లిగూడెం , తణుకు, ఆచంట మీదుగా భీమవరం చేరుకున్నాక రెండు రోజుల పాటు భీమవరంలోనే పవన్ కళ్యాణ్ బస చేయటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే సందర్భంలో కేవలం నేతలను మాత్రమే కాకుండా పవన్ కార్యకర్తలను సైతం కలుస్తారని ప్రచారం జరుగుతుంది.

భీమవరం కేంద్రంగా పవన్ రాజకీయం..

మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్లు జనసేన వర్గాల నుంచి ఇదే సంకేతాలు బలంగా వస్తున్నాయి . ముఖ్యంగా గోదావరి జిల్లాలను అంటి పెట్టుకుని ఉంటా అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించటం , భీమవరం సభలో ప్రసంగిస్తూ ఇది నేను పోటీ చేసే ప్రాంతం కాబట్టే డంపింగ్ యార్డ్ చూసాను.. మీరు చూసారా అంటూ అధికార వైసిపికి చెందిన తన ప్రత్యర్థి గ్రంధి శ్రీనివాస్ ను నిలదీయటం కూడా ఒక కారణం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ బలమైన సామాజిక వర్గాలుగా కాపులు , రాజుల తో పాటు శెట్టిబలిజ , గౌడ , తూర్పు కాపు వంటి వెనుకబడిన కులాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దింతో సామజిక వర్గాల నేతలు తూర్పు కాపులతో పాటు గౌడ , శెట్టిబలిజ కుల నాయకులతో పవన్ వ్యూహాత్మకంగా సమావేశాలు నిర్వహించారు. వారి సమస్యలను ప్రస్తావించటం కూడా ఆయా వర్గాలను జనసేనకు చేరువ చేయటంలో భాగమనేది జరుగుతున్న ప్రచారం.

అయితే ఇవే సామాజికవర్గాల నేతలు పవన్ కళ్యాణ్ పర్యటన తరువాత అధికార వైసీపీకి అనుకూలంగా సమావేశాలు నిర్వహించటం, ప్రకటనలు చేయటం భీమవరం రాజకీయాలను వేడెక్కిస్తుంది . ఈ నేపధ్యలో పవన్ ప్రసంగాలు వచ్చే ఎన్నికల్లో ఎంత వరకు ఓట్లు రాలుస్తాయనేది వేచి చూడాల్సిన ఉంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో దాదాపు 8 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇది జనసేన కార్యకర్తలు జీర్ణించుకోలేని విషయం. అయితే ఆ తరువాత పవన్ కళ్యాణ్ భీమవరంలో జనవాణి కార్యక్రమాన్ని మొదలు పెట్టటం , వారాహి సందర్భంగా బస ఇవన్నీ ఒకవైపు చేస్తుంటే పవన్ పట్ల సానుకూలత , ఓడిపోయారనే సానుభూతి పెరిగిందనేది జనసేన వైపు నుంచి వినిపిస్తున్న మాట . ఇక్కడ గత ఎన్నికల్లో ఒడి పోయిన సింపతి వర్క్ అవుట్ అవుతుందా , టి డి పి – జనసేన పొత్తు అనుకూలంగా మారుతుందా అంటే మరికొంత కాలం ఆగాల్సిందే ..! . ఇక్కడా పవన్ ఓటమి తరువాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు గోవిందరావు పార్టీని బలోపేతం చేయటానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు . భీమవరం నియోజవర్గంలో టౌన్, గ్రామంలలో నాయకులను నియమించి బలమైన కార్యకర్తలను ఏర్పాటు చేసుకున్నారు. 2024 లో జనసేన విజయం సాధించేందుకు అన్ని ప్లాన్లు వేస్తున్నారు. ఇప్పటికే వీరవాసరం మండలంలో టిడిపి తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి మెరుగైన ఫలితం సాధించారు . గత పంచాయతీ, ఎంపీటీసీ , జడ్పిటిసి ఎన్నికల్లో టిడిపి తో జనసేన కలసి పోటీ చేసింది. వీరవాసరం మండలం జడ్పిటిసి జనసేన గెలుచుకుంటే మండల పరిషత్ చైర్మన్ పదవి టిడిపి గెలుచుకున్నాయి.

టిడిపి, జనసేన పొత్తు ఉంటే..

వై సి పి వ్యతిరేక ఓటు చీలనీయను అన్న పవన్ కళ్యాణ్ మాటతో టిడిపి , జనసేన మధ్య పొత్తు ఖాయం అనేది స్పష్టమవుతుందనేది సాధారణ రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి . ఈక్రమంలో పశ్చిమగోదావరి జిల్లాలో నర్సాపురం , పాలకొల్లు , ఉండి , ఆచంట , భీమవరం , తణుకు , తాడేపల్లిగూడెం నియోజకవర్గాలు ఉన్నాయి . ఇక్కడ 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాల్లో విజయం సాధించింది . దీన్తో ఆరెండు చోట్ల తో పాటు మరో మూడు చోట్ల టి డి పి సర్వ్ చేయించుకుని మొత్తం 5 సీట్లు కావాలని రెండు జనసేనకు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది . అయితే జనసేన మాత్రం గత ఎన్నికల్లో భీమవరం , నరసాపురం ల్లో రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాలతో పాటు మరో మూడు స్థానాల కోసం పట్టు పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంద .

పార్టీల బలం బలహీనతలు..

2019 ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు. పరిశీలిస్తే భీమవరంలో మొత్తం ఓట్లు : 246342, ఇందులో వైసీపీ. : 70642 సాధించగా జ నసేన. : 62285 రెండో స్థానంలో నిలిచింది , టిడిపి. : 54, 037 ఓట్లతో మూడో స్థానానికి పరిమిత మైన పరిస్థితి . ఈ ఎన్నికల్లో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ పై మెజారిటీ 8, 357 ఓట్లు సాధించారు .
ప్రస్తుతం అధికార పార్టీ పై సహజంగా ఉండే వ్యతిరేకత , టి డి పి -జనసేన పొత్తు ప్రభావంతో పవన్ గెలుస్తారని జనసేన నేతలు ధీమాగా ఉన్నారు . జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేస్తారనే ప్రచారంతో నియోజవర్గం ప్రజలందరిలోనూ ప్రత్యేక ఆసక్తి ఉంది. ఎన్నికల్లో ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ను గెలిపించేందుకు జనసేన నాయకులు బలంగా కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సానుభూతి నియోజకవర్గ ప్రజల్లో కనిపిస్తుంది . నియోజవర్గంలో కీలక మండలమైన వీరవాసరం ఇప్పటికే జనసేన ప్రాబల్యాన్ని చూపిస్తుంది. జనసేన నాయకులు, కార్యకర్తలు గ్రౌండ్ వర్క్ సైలెంట్ గా చేస్తున్నారు. నియోజవర్గ సమస్యలపై పోరాడుతున్నారు. తాడేరు వంతెన నిర్మాణం కోసం పాదయాత్ర, రైతు సమస్యలపై పోరాటం జనసేనను ప్రజల్లోనికి తీసుకెళ్లాయి. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ప్రజలను సరిగ్గా కలవలేకపోవడం. సభలతోనే సరిపెట్టడం. కొంతమంది నాయకులను, కుల పెద్దలను, ప్రముఖులను కలవడం తప్ప గ్రామాల్లో తిరిగింది లేదనే ప్రచారం బలంగా వినిపిస్తుంది . పవన్ కళ్యాణ్ పోటీపై పూర్తి స్పష్టత లేదు. పవన్ కళ్యాణ్ భీమవరం కు ఏమీ అభివృద్ధి చేస్తారనే దానిపై ఇప్పటి వరకు పూర్తి క్లారిటీ లేదు . పవన్ కళ్యాణ్ గెలిచినా ప్రజలకు అందుబాటులో ఉండరనే ప్రచారం బలంగా వినిపిస్తుంది . ”మిమ్మలను కలవాలంటే షూటింగ్ స్పాట్లకు రావాలా , హైదరాబాద్ రావాలా అని ఇప్పటికే ఏం ఎల్ ఏ గ్రంధి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్నారు.

Pawan Kalyan

గ్రంధి శ్రీనివాస్‌కు అవి ప్లస్.. అవి మైనస్..

ఇక అధికార వైసిపి కి భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పడడం, జగన్ సంక్షేమ పథకాలు, వైసిపికి అనుకూలించే అంశాలుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు ప్రత్యేకమైన వర్గం ఉంది. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావటంతో వైసీపీకి కలసి వస్తుంది. అయితే నియోజవర్గంలో సమస్యలు అపరిష్కృతంగా ఉండటం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలైన డంపింగ్ యార్డ్ సమస్య తీరకపోవటం, 15 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెనలకు అప్రోచ్ రోడ్లు వేయలేక పోవటం అధికార పార్టీకి తలపోటుగా మారుతున్నా పరిస్థితి కనిపిస్తుంది.

ఇక గత ఎన్నికల్లో మూడో స్థానానికి పరిమితమైన టిడిపి ఓటమి తరువాత కోలుకునేందుకు అవసరమైన తరహాలో పనితీరును ప్రదర్శించలేకపోయిందనేది ఆపార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఒకప్పుడు టిడిపికి బలమైన నియోజవర్గం భీమవరం. బలమైన కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. భీమవరంలో బలమైన పార్టీ అయినా టిడిపికి ఇప్పుడు బలమైన అభ్యర్థి లేడు. మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు యాక్టివ్ గా లేకపోవటం, జిల్లా అధ్యక్షురాలు, నియోజకవర్గ ఇంచార్జ్ సీతారామలక్ష్మి వయోభారం, ఆమె అందర్నీ కలుపుని వెళ్లడం లేదని విమర్శలు ఉన్నాయి.

వై నాట్ 175 నినాదాన్ని బలంగా అధికార వై సి వినిపిస్తుంది. ఒకపుడు కుప్పం తన కంచుకోటగా భావించిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఆత్మ పరిశీలనలో పడి తరుచుగా అక్కడ పర్యటిస్తుండటంతో పాటు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఏపి రాజకీయాల్లో బలమైన వ్యక్తిగా మారాలని తన మాటల్లో తపన పడుతున్న పవన్ కళ్యాణ్ తన కంటూ ఒక సొంత నియోజకవర్గం , అక్కడ ప్రజల సాధక బాధలు తీర్చేందుకు ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసే నాయకులు తమ ప్రాంతంలో ప్రజాసమస్యలను తీర్చే నేతలుగా గుర్తింపు కోరుకుంటారు. వారిని ముందు ఉండి నడిపించలేకపోతే గ్రూప్ గొడవలు పెరుగుతాయి. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గోవిందరావు తో జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడుతో అంతర్గత దూరం పెరిగింది . ఈక్రమంలో పవన్ పర్యటనలో జయప్రకాష్ చేసిన వ్యాఖ్యలను జనసేన పార్టీ నేతలు సీరియస్ గా తీసుకోవలసిన అవసరం ఉంది. పది లక్షలు పార్టీ ఫండ్ ఇచ్చిన వారికే పవన్ ను కలిసేందుకు అవకాశం ఉంటుందని ఆవేదన వ్యక్తం చేయటం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారటం అధికార వైసీపీ చేసే విమర్శలకు ఊతం ఇచ్చినట్లయింది. ఈ ఘటన తరువాత అయినా జనసేన సంస్థాగతంగా మారకపోతే ఇబ్బందులు తప్ప వనేది మాత్రం అందరినోట వినిపిస్తున్నమాట.

– బండికట్ల రవి కుమార్, స్పెషల్ కరస్పాండెంట్, టీవి9 తెలుగు, పశ్చిమ గోదావరి జిల్లా

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..