AP Aided School: ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల పై రాజకీయ దుమారం రేగుతుంది. ఎయిడెడ్ సంస్థలను ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ విపక్షాలతో పాటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి. అసలింతకీ ఎయిడెడ్ వివాదం ఏంటి..? ఏపీ సర్కార్ ఏం చెబుతోంది..? విపక్షాల విమర్శలేంటి..? నిజంగా విద్యార్ధులు నష్టపోతారా..? విద్యార్ధులపై ఫీజుల భారం పడుతుందా…? ఎయిడెడ్ గందరగోళంలో వాస్తవాలేంటి.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఏపీలో ఎయిడెడ్ విద్యాసంస్థల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్షాలతో పాటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990 కు ముందు ఎయిడెడ్ విద్యాసంస్ధల ఏర్పాటు జరిగింది.అప్పట్లో సరైనన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు లేకపోవడంతో దాతల సహకారంతో విద్యాసంస్థలు ఏర్పాటు చేసారు. అయితే వాటిలో పనిచేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది. అప్పటి నుంచి ఎయిడెడ్ విద్యాసంస్థలుగా స్కూల్స్, జూనియర్, డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. ఏపీలో వైఎస్ జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిడెడ్ విద్యాసంస్థలపై దృష్టి పెట్టింది. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో రోజురోజుకూ ప్రమాణాలు పడిపోతుండటం, విద్యార్ధుల సంఖ్య తగ్గిపోతుండటం, కొత్తగా నియామకాలు లేకపోవడంతో ఏంచేయాలనే దానిపై సర్కార్ ఫోకస్ పెట్టింది.
ఆయా సంస్థల్లో ప్రమాణాలు, రన్ చేస్తున్న విధానం, అడ్మిషన్లతో పాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ కమిటి నియమించింది. ఈ ఏడాది ఏప్రిల్ 6న జీవో 52 విడుదల చేసింది సర్కార్. పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం మాజీ వీసీ రత్నకుమారి అధ్యక్షతన ఎనిమిది మందితో కమిటీ నియమించింది ప్రభుత్వం.. ఆయా విద్యాసంస్థల్లో పరిస్థితులు పరిశీలించిన తర్వాత.. ఎయిడెడ్ సంస్థలకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ అవసరం లేదని నివేదిక ఇచ్చింది కమిటి.
కమిటీ నివేదిక ఆధారంగా ఎయిటెడ్ సంస్థలకు మూడు ఆప్షన్లను ఇచ్చింది ప్రభుత్వం. వాటిలో మొదటిది విద్యాసంస్థలు ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించడం.. రెండోది ఆస్తులు కాకుండా కేవలం స్టాఫ్ ను మాత్రం అప్పగించడం, ఇక మూడోది యధాతధంగా కొనసాగించడం. రాష్ట్ర వ్యాప్తంగా 2వేల 249 ఎయిడెడ్ విద్యాసంస్థలు ఉన్నాయి. వాటిలో 1988 స్కూల్స్, ఇంటర్ కాలేజీలు 122, డిగ్రీ కాలేజీలు 137, పాలిటెక్నిక్ 2 కాలేజీలు ఉన్నాయి. ఆయా సంస్థలకు స్టాఫ్ జీతాల కోసం 1225 కోట్లు ప్రతియేటా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం ఇచ్చిన మొదటి ఆప్షన్ ప్రకారం ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించేందుకు 101 సంస్థలు ముందుకొచ్చాయి. ఆస్తులు కాకుండా కేవలం స్టాఫ్ ను మాత్రం అప్పగించేందుకు 1446 సంస్థలు అంగీకారం తెలిపాయి. ఇక ఎలాంటి ఆప్షన్ కు 702 సంస్థలు ముందుకు రాలేదు. అయితే ఎయిడెడ్ సంస్థల విషయంలో ఎలాంటి బలవంతం లేదని.. ఇష్ట ప్రకారమే సంస్థల విషయంలో నిర్ణయం తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
ప్రభుత్వం వెర్షన్ ఇలా ఉంటే .. ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాల వెర్షన్ మాత్రం మరోలా ఉంది. సిబ్బందిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం వల్ల విద్యార్ధులపై ఫీజుల భారం పడుతుందనేది వాదన. కొత్తగా స్టాఫ్ ను రిక్రూట్ చేయడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేయాలని విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రెస్ మీట్ ను అడ్డుకున్నాయి విద్యార్థి సంఘాలు. మరోవైపు ఎయిడెడ్ విద్యాసంస్థల ఆస్తుల కోసం ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందనేది టీడీపీ వాదన. తాము అధికారంలోకి వస్తే ఎయిడెడ్ ను యధాతదంగా కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. విద్యాసంస్థల ఆస్తులను తాకట్టు పెట్టడం ద్వారా అప్పుల కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కూడా టీడీపీ విమర్శిస్తుంది. అటు విశాఖ, కాకినాడ, అనంతపురంలో విద్యార్ధులు, తల్లిదండ్రుల ఆందోళనలను కూడా క్యాష్ చేసుకుంటుంది టీడీపీ. సోమవారం అనంతపురంలో సత్యసాయి కళాశాల ముందు విద్యార్ధులు చేసిన ఆందోళనకు మద్దతుగా లోకేష్ బుధవారం అనంతపురం వెళ్తున్నారు.
టీడీపీ, ఇతర ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను రాజకీయ కోణంలోనే చూస్తుంది ప్రభుత్వం. కేవలం రాజకీయాల కోసం విద్యార్ధుల జీవితాలతో ఆటలాడితే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కోర్సులకు పూర్తి ఫీజులు చెల్లించడంతో పాటు నాడు-నేడు పథకం కింద విద్యాసంస్థలను వేలకోట్లతో అభివృద్ది చేస్తున్నామన్నారు మంత్రి. ఎయిడెడ్ విద్యాసంస్థల్లో పనిచేసే సిబ్బందిని వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆయా కాలేజీలు మరో రెండేళ్ల వరకూ ఫీజులు పెంచే అవకాశం లేదన్నారు మంత్రి. 2023 వరకూ ప్రభుత్వం ఫిక్స్ చేసిన ఫీజులే చెల్లింంచాలని చెప్పారు. అంతేకాకుండా ఎయిడెడ్ సంస్థల్లో విద్యార్ధులు తగ్గిపోతుండటం, దొడ్డి దారిలో నియామకాలు చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు.
గతంలో సీఎం జగన్ కూడా ఎయిడెడ్ విషయంలో క్లారిటీ ఇచ్చారని.. ఎవరిపై ఎలాంటి ఒత్తిడి లేదని చెబుతున్నారు మంత్రి. అనంతపురం కాలేజీలో విద్యార్ధులపై లాఠీచార్జి జరగలేదని.. విద్యార్ధుల ముసుగులో కొంతమంది రాళ్లు రువ్వడం వల్లే విద్యార్ధులు గాయపడ్డారని చెప్పుకొచ్చారు. కాకినాడ, విశాఖలో కూడా తల్లిదండ్రుల ఆందోళన వెనక టీడీపీ ఉందని మంత్రి ఆరోపించారు. మొత్తానికి ప్రభుత్వం ఎంత చెబుతున్నప్పటికీ.. ప్రతిపక్షాలు, విద్యార్ధి సంఘాలు మాత్రం జీవోల రద్దు కోసం పట్టుపడుతున్నాయి. మూడు జీవోలు రద్దు చేయకుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీ ముట్టడిస్తామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఈ వివాదానికి ఎక్కడ చెక్ పడుతుందనేది చూడాలి.
ఇవి కూడా చదవండి: