అంతర్వేది(Antarvedi) వాసులను సముద్రుడు భయపెడుతున్నాడు. సముద్రం వెనుక్కు వెళ్లడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న సాగరం.. ఉన్నట్లుండి లైట్ హౌస్ కు రెండు కిలోమీటర్లు వెనక్కు వెళ్లిపోయింది. బంగాళాఖాతంలో(Bay of Bengal) గోదావరి నది కలిసే సంగమ ప్రదేశం.. అంతర్వేది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి(Sakhinetipalli) మండలంలో ఉన్న అంతర్వేదిలో లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు. స్వామి దర్శనానికి నిత్యం పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. గతంలో అమావాస్య, పౌర్ణానికి ముందుకు, వెనక్కు వెళ్లే సముద్రం.. తాజాగా వెనక్కు వెళ్లిపోవడంతో విచిత్ర పరిస్థితిని చూసి తీర ప్రాంత గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. సముద్రం ఇలా వెనుకకు వెళ్ళడం ముందు ముందు ఏర్పడే విపత్కర పరిస్థితులకు సంకేతమని అంటున్నారు. సముద్ర తీరానికి 7 కిలోమీటర్లు దూరంలో ఉండే ఐలాండ్ కనుమరుగు కావడంపై పర్యటనకు వెళ్లే వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.